Dharmapuri Sanjay: సంజయ్‌కి గ్రీన్‌సిగ్నల్ వస్తుందా... రాదా?

Dharmapuri Sanjay: ఆయన స్వగృహ ప్రవేశం ఈజీయే అనుకున్నారు పార్టీలోకి వస్తానంటే అందరూ ఆహ్వానిస్తారని భావించారు.

Update: 2021-10-14 03:11 GMT

Dharmapuri Sanjay: సంజయ్‌కి గ్రీన్‌సిగ్నల్ వస్తుందా... రాదా?

Dharmapuri Sanjay: ఆయన స్వగృహ ప్రవేశం ఈజీయే అనుకున్నారు పార్టీలోకి వస్తానంటే అందరూ ఆహ్వానిస్తారని భావించారు. నిజానికి అంతా అనుకున్నట్టు జరిగితే ఈపాటికే హస్తానికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చేవారే!! కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందని ఆయన ఫీలవుతున్నారట. ఆయన రాకకు సీనియర్లే బ్రేకులు వేశారట. ఆయనొస్తే తాము ఉండలేమంటూ తెగేసి చెప్పేశారట. ఇంతకీ ఆ మాజీ మేయర్‌కు బ్రేకులు వేస్తున్నది ఎవరు? ఆయన యాక్టివ్ అయితే జరిగే నష్టం ఎవరికి? ఆ మాజీ మేయర్ రీఎంట్రీపై కాంగ్రెస్ ఏమంటోంది.?

నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ గూటిలో చేరేందుకు ఆ పార్టీ అధిష్టానం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఒకే చెప్పినా జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు మాత్రం నో నో అంటున్నారట. ధర్మపురి సంజయ్‌కు వ్యతిరేకంగా ఓ కూటమి కట్టి మరీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారన్న చర్చ జరుగుతోంది. పీసీసీలో కీలకంగా ఉన్న ఓ నేత ఏకంగా రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లి బ్రేకులు వేయించారని చెప్పుకుంటున్నారు. సంజయ్‌తో పాటు, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ, మహబూబ్‌నగర్ నుంచి ఎర్ర శేఖర్ రేవంత్‌ను కలిసి, తమ మనస్సులో మాట చెప్పేశారట. దానికి రేవంత్ కూడా ఓకే అనేశారని సమాచారం. అప్పటి నుంచి ఎదురు చూసిన నేతల్లో భూపాలపల్లి నేత గండ్ర సత్యనారాణయణ కాంగ్రెస్ కండువా కప్పుకోగా, ఎర్ర శేఖర్‌కు ఎర్ర తివాచీ పరిచారట. ఇక తన నెంబర్ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్న ధర్మపురం సంజయ్‌కి మాత్రం ఇంకా గ్రీన్‌సిగ్నల్ లభించలేదట.

తన తండ్రి డి. శ్రీనివాస్ టీఆర్ఎస్‌లో చేరడంతో సంజయ్ కూడా ఆయన బాటలోనే నడిచారు. మొన్నటి వరకు గులాబీ పార్టీలో ఉన్నా ఆయన పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహారించారు. రేవంత్ పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయనతో పాటే నడవాలని నిర్ణయించుకున్నారు. అనుకుందే తడవుగా పార్టీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కాకపోతే పీసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన చేరికపై సస్పెన్స్ నెలకొంది. అర్బన్‌లో పట్టు ఉన్న సంజయ్‌కి జిల్లాకు చెందిన ఓ కీలక నేత బ్రేకులు వేస్తున్నారని సంజయ్‌ అనుచరులు ఆరోపిస్తున్నారు. రాజకీయంగా మంచి ట్రాక్‌ రికార్డ్‌ లేని సంజయ్‌ని పార్టీలో చేర్చుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేయించారట. ఇటు కొడుకును హస్తం పార్టీలో చేర్చేందుకు డీఎస్‌ కూడా తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారట.

హస్తం పార్టీలోకి రావాలని ఉవ్విళూరుతున్న సంజయ్‌కి గ్రీన్‌సిగ్నల్ ఎప్పుడొస్తుందో అసలు వస్తుందో రాదో తెలియక ఆయన అనుచరులు తికమకపడుతున్నారట. మాజీ మేయర్ పార్టీలో చేర్చుకునే విషయంలో రేవంత్ మాట చెల్లుతుందా పీసీసీ కీలక నేతల పంతం నెగ్గుతుందా తెలియాంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News