ఆయన కాషాయ పార్టీలో సిన్సియర్ లీడర్...సీనియర్ నాయకుడిగా, రాష్ట్ర పార్టీలో మంచి గుర్తింపు ఉంది. హిందుత్వ వాదానికి నిలువుటద్దంగా నిలుస్తారని ఆర్.ఎస్.ఎస్.లో పలుకుబడి ఉంది. పార్టీలో ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే తత్వమన్న పేరూ వుంది. ఎవరి మనస్సూ నొప్పించని మిస్టర్ కూల్ లీడర్. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆయనకు మాత్రం అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారుతాయి. కొన్నేళ్లుగా ఇదే తంతు. ఇంతకీ అన్నీ వున్నా, ఆయనకు శని ఎందుకు పట్టుకుంది..ఎవరి రూపంలో అడ్డుపడుతోంది? లేటెస్ట్ బండి సంజయ్ సైతం ఎందుకంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది ఎంతకీ ఎవరాయన?
ఇందూరు కాషాయ పార్టీలో ఆయన స్థానం ప్రత్యేకం. వ్యాపారవేత్తగా, కాషాయ పార్టీలో చేరి మిస్టర్ కూల్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. పార్టీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎదిగారు. ఏదో రకంగా సేవచేస్తూ.. ఇందూరు వాసులకు సుపరిచితుడు ధన్ పాల్ సూర్య నారాయణ. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఇంచార్జీగా ప్రస్తుతం కొనసాగుతున్న సూర్యనారాయణ, జిల్లా బీజేపీలో మూడు వర్గాలు ఉండగా అందులో మూడో వర్గం నడిపిస్తున్నారట. పండగలు వచ్చినా పార్టీ కార్యక్రమాలు ఉన్నా తన బలం నిరూపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతారన్న పేరుంది ఆయనకు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆయన చిరకాల వాంఛ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఒక్కసారైనా సేవ చేయడం. ఈ మేరకు ఆయన గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకుని రెడీగా ఉంటే, గత ఎన్నికల్లో టికెట్టు చేతి వరకూ వచ్చి చివరి క్షణంలో చేజారిందట. ధన్‌పాల్ కు టికెట్టు వస్తే ఎమ్మెల్యేగా గెలిచే వారనే టాక్ కూడా నడిచింది. టికెట్టు దక్కలేదనే కోపంతో ఆయన అనుచరులు దూకుడుగా వ్యవహరించి, ఏకంగా పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అప్పట్లో రాష్ట్రస్థాయిలో వివాదమైంది. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారనే ప్రచారం కూడా సాగింది. ఈ ఘటన మరువక ముందే ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎదుట, సూరన్న అనుచరుల బల ప్రదర్శన మరోసారి వివాదాన్నిరాజేసింది. తమ నేత పేరు పిలవడం లేదని సంజయ్ ప్రసంగానికి అడ్డుపడటంతో, ఒక్కసారి ఆయన ఫైరయ్యారు. ఏం తమాషాగా ఉందా..? అంటూ సూరన్న అనుచరులపై ఫైర్ అయ్యారు. ఈ పరిణామంతో జిల్లా బీజేపీ నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారట.
ధన్ పాల్ సూరన్న మంచోడే, పార్టీకి విధేయుడే కానీ ఆయన అనుచరుల దూకుడు, సదరు నేతకు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోందన్న మాటలు వినపడుతున్నాయి. పార్టీ కార్యాలయంపై దాడి ఘటన, కొత్తగా రాష్ట్ర అధ్యక్షునిగా తొలిసారిగా జిల్లాకు వచ్చిన బండి సంజయ్ ప్రసంగానికి అడ్డుతగలడం లాంటి అంశాలు, సూరన్న రాజకీయ భవిష్యత్తుకు గండి కొట్టే ప్రమాదం వుందన్న చర్చ జరుగుతోందట. ఇప్పటికే ఈ విషయాన్ని అధిష్ఠానం సీరియస్ గా తీసుకుందట. మొన్నటికి మొన్న సూరన్నకు జిల్లా అధ్యక్షునిగా అవకాశం వచ్చినట్లే వచ్చి తృటిలో చేజారింది. దీనికి అనుచరుల దూకుడు ఓ కారణం అనే టాక్ నడిచింది. ఆయన నమ్ముకున్న అనుచరగణం సదరు నేత భవిష్యత్తుకు దెబ్బ కొడతున్నారనే టాక్ పార్టీలో చక్కర్లు కొడుతోంది. వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన సూరన్న, రాజకీయాల్లో మాత్రం అంతగా చాణక్యం ప్రదర్శించలేకపోతున్నారట. అదే ఆయనకు మైనస్ అవుతోందట. ప్రతీ నేతకు కార్యకర్తలు, అనుచరులు బలంగా ఉంటే, సదరు నేతకు మాత్రం ఆ అనుచరగణం మైనస్ గా మారారనే ప్రచారం ఉంది. సదర నేత మాత్రం అనుచరులకు పార్టీ జిల్లా కార్యవర్గంలో కీలక పదవులు ఇప్పించుకుని కార్యకర్తలకు అండగా నిలబడేందుకే మొగ్గు చూపుతున్నారట.
నిజామాబాద్ కాషాయ పార్టీలో ఇప్పటికే ఎంపీ అర్వింద్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ వేర్వేరు గ్రూపులుగా ఉండగా తాజాగా సూరన్న మూడో వర్గంగా పార్టీలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఐతే సూరన్న మంచితనానికి, పార్టీ విధేయతకు ఆయన అనుచరగణం చేష్టలు గండి కొడుతోంది. ఇప్పటికైనా సదరు నేత మేల్కొని ఫాలోవర్స్ దూకుడుకు బ్రేకులు వేస్తారో, లైట్ తీసుకుంటారో చూడాలి.