senior Congressmen giving tough fight to Revanth Reddy : పీసీసీ రేస్‌లో రేవంత్‌తో ఫైట్‌కు రంగంలోకి ఆ సీనియర్ ఎవరు?
senior Congressmen giving tough fight to Revanth Reddy over PCC post: మొన్నటి వరకు పీసీసీ రేసులో వినిపించని పేరు తెరపైకి వస్తోంది. ఓటమి తర్వాత గాంధీభవన్ పరిసరాల్లో కనిపించని లీడర్, పోటీలో దూసుకొస్తున్నారు. అయితే పీసీసీ చీఫ్ మాలో ఒకరిని చెయ్యండి లేదంటే మేమంతా మూకుమ్మడిగా ప్రతిపాదించే ఒక సీనియర్‌కు పట్టంకట్టండి అంతేగానీ, రేవంత్‌కు మాత్రం సింహాసనం ఇవ్వొద్దంటూ, ఒక నేత పేరును ముందుపెట్టారట టీపీసీసీ లీడర్లు. ఇంతకీ ఎవరా పెద్దాయన....? రేవంత్‌కు చెక్‌పెట్టేందుకే సదరు నేతను సర్వామోదం అంటున్నారా? అధిష్టానం మదిలో ఏముంది?
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వాగ్దాటికి కాంగ్రెస్‌లో ఒక్కరూ తట్టుకోలేరు. మాటలతో కుమ్మిపడేసే మాటకారి కేసీఆర్. ఆయన్ను దీటుగా ఎదుర్కొవడంలో, సభ లోపలా, బయటా ఆపసోపాలు పడుతున్న పరిస్థితి విపక్ష నాయకులది. కేసీఆర్‌కు మాటకు మాట అన్నట్టుగా రేవంత్ రెడ్డి చెలరేగిపోయినా, అసలు లెక్కలోకి తీసుకోడు గులాబీ బాస్. ఒక్క మాట ఎవరైనా అంటే వంద మాటలతో కుళ్లబొడిచే కేసీఆర్, కాంగ్రెస్‌లో ఒక్క నాయకుడిని మాత్రం గౌరవంగా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన్నే పీసీసీ రేసులోకి దింపుతోంది కాంగ్రెస్ అధిష్టానం.
మొన్నటి వరకు టీపీసీసీ రేసులో చాలా పేర్లు వినిపించాయి. రేవంత్ రెడ్డినే తదుపరి స్టేట్ కాంగ్రెస్ చీఫ్ అంటూ చాలామంది బ్యానర్లు కట్టేశారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డేనంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు హోరెత్తాయి. శ్రీధర్ బాబు అంటూ ఒకరు, కాదు భట్టి విక్రమార్క అంటూ మరొకరు పీసీసీ స్క్రీన్‌పైకి వచ్చారు. ఇప్పుడు మాత్రం, పాత పేరు కొత్తగా వినిపిస్తోంది. ఇంతకీ ఆయన ఎవరు?
ఔను. పెద్దలు, గౌరవనీయులు కుందూరు జానారెడ్డి. పీసీసీ రేసులో సడెన్‌గా జానారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఢిల్లీ వర్గాల్లో ఈ పేరిప్పుడు నిత్యనామస్మరణగా మారిందట. జానారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తోందట సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ అధిష్టానం. దశాబ్దాలుగా కాంగ్రెస్‌లోనే వుంటున్న జానాకు, పార్టీ పగ్గాలు అప్పగించడంపై మేథోమథనం సాగిస్తోందట. ఇంతకీ ఇంత సడెన్‌గా జానాపేరు ఎందుకు పీసీసీ రేసులోకొచ్చింది?
కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలన్నీ రేవంత్ చుట్టే తిరిగాయి. దూకుడు స్వభావమున్న రేవంత్‌కు ఇస్తేనే పార్టీ పరుగులు పెడుతుందని భావించిందట. కానీ గ్రూపు రాజకీయాల్లో పేరుమోసిన కాంగ్రెస్‌లో, కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్‌కు రెడ్ సిగ్నల్ వేస్తున్నారట కొందరు. మొన్నమొన్న వచ్చిన వ్యక్తికి, అందులోనూ ఓటుకు నోటు కేసులో వీడియో సాక్షిగా దొరికిన రేవంత్‌కు పగ్గాలు అప్పగిస్తే, మొదటికే మోసం వస్తుందని స్టేట్ సీనియర్లంతా సోనియాకు నూరిపోశారట. ఒకవేళ రేవంత్‌కు ఇస్తే, పార్టీ నిట్టనిలువునా చీలుతుందని, తామంతా కూడగట్టుకుని పార్టీ మారతామని హెచ్చరించారట. దీంతో రేవంత్‌కు పార్టీ పగ్గాలు అప్పగించి, ఆంధ్రప్రదేశ్‌లో మాదిరి పార్టీ సమాధికావడం ఎందుకు సర్వామోదం వున్న జానారెడ్డికి ఇస్తే మేలని భావిస్తోందట అధిష్టానం. జానారెడ్డి పేరు తెరపైకి రావడం వెనక ఇదీ కథ.
జానారెడ్డికి స్టేట్ స్టీరింగ్ ఇస్తే, అసమ్మతికి చాన్స్ వుండదట. రేవంత్ సైతం ఓకే అంటారట. అటు కేసీఆర్ సైతం పెద్దలు, గౌరవనీయులంటూ సంభోదిస్తారు. ఇలా ఎన్ని రకాలు చూసినా జానాకు పగ్గాలు మేలేనని కాంగ్రెస్ ఆలోచనట. అయితే, స్లో అండ్ స్టీడీ అన్నట్టుగా, నిదానానికే నిదానమన్నట్టుగా వుండే జానా, పార్టీని ఎలా పరుగులు పెట్టిస్తారని, మరో వర్గం కూడా వాయిస్ రైజ్ చేస్తోంది. చూడాలి, చివరికి హైకమాండ్ డెసిషనేంటో.