ఆ ఎమ్మెల్యే కన్ను పడితే అంతే..ప్రతి భూమి కబ్జానే

Update: 2020-11-28 14:41 GMT

ఆయనో ఎమ్మెల్యే. ప్రజలే దేవుళ్లే, వారికి సేవ చేయడమే పరమావధి అని చెప్పిన ప్రజాప్రతినిధి. కానీ రియల్‌ క్యారెక్టర్‌ మాత్రం వేరే. ఎందుకంటే, ఆయనదంతా రియల్‌ దందా. పచ్చని భూమి ఎక్కడ కనిపించినా, వెచ్చగా వాలిపోతాడట. ప్రభుత్వ భూమి లేదంటే, వివాదాస్పద ల్యాండ్ కనపడితే చాలు, పండగ చేసుకుంటాడట. ఎకరాలకు ఎకరాలు వెనకేసుకోవడమే ఆయన హాబీ అట. నియోజకవర్గాలు, జిల్లాల సరిహద్దులే కాదు, రాష్ట్రాల హద్దులనూ చెరిపేశాడట భూ దందాలో. ఆయన రియల్‌ నైజంపై, జనాలు, ప్రత్యర్థులే కాదు, సొంత పార్టీ నేతలూ రకరకాలుగా, కథలుకథలుగా చెప్పుకుంటున్నారట.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే వున్నారు. ఆయన పేరేంటో, ఏ నియోజకవర్గమో అవసరం లేదు. కానీ సదరు ప్రజాప్రతినిధి రియల్ దందా స్థానిక ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ఆ ఎమ్మెల్యే కన్ను ఆ భూములపై పడితే చాలు, అవి దక్కాల్సిందే, దక్కి తీరాల్సిందే. దక్కకపోతే, సామదాన దండోపాయాలు ప్రయోగిస్తాడట. అలా వందల ఎకరాలు వెనకేసుకుంటున్నారట.

జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక సరిహద్దు గ్రామాల్లో వందల ఎకరాల భూములున్నాయట ఆయనకు. అలాగే, మహరాష్ట్రలో భారీగా కొన్నారట. కుటుంబ సభ్యుల పేర్ల మీద విచ్చలవిడిగా ల్యాండ్స్‌ వెనకేసుకుంటున్నారట. సర్కార్ భూములు, వివాదంలో ఉన్న ల్యాండ్స్ ఎక్కడుంటే, అక్కడ వాలిపోతారట ఆ ఎమ్మెల్యే. రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు వ్యవసాయ భూములపై భారీగా పెట్టుబడులు పెట్టడం ఆయన హాబీ. ఓ గ్రామంలో ఎకరం భూమి ధర మహా అంటే ఐదు లక్షలు మించదు. కాని ఆ ఎమ్మెల్యే మాత్రం పాతిక లక్షలు పెట్టి కొనేశారట. ఆ ఎమ్మెల్యే అమాంతంగా ధరలు పెంచడంతో రేట్లు నింగిని తాకుతున్నాయట. సాధారణ వ్యక్తులు, రైతులు భూములు కొనుగోలు చేయలేకుండా ధరలు పెంచుతున్నారని సామాన్యులు రగిలిపోతున్నారు.

అసలు ఇంతలా ఆయన భూములు ఎలా కొంటున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయోనని ఆరాతీస్తే, ఆయన ప్రత్యర్థులు పెద్ద లెక్కలే వెలికి తీశారు. నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకు ఏ పని జరిగినా, కనీసం ఐదు నుంచి పదిశాతం కమీషన్ చేతిలో పెట్టాల్సిందేనట. అలా వచ్చిన అదనపు ధనంతోనే భూములు కొనుగోలు చేస్తున్నారని, సొంత పార్టీ నేతలు సైతం గళమెత్తుతున్నారట. ఎన్నికల సమయంలో ఖర్చు చెయ్యడానికి ఇచ్చిన డబ్బును ఖర్చు చేయలేదట సదరు ఎమ్మెల్యే. గెలుస్తానో లేదోనన్న ఆలోచనతో పార్టీ ఫండ్‌ బయటకు తియ్యలేదట. అలా మిగిలిన సొమ్ముతోనే, భూములు కొనుగోలు చేస్తున్నారని వినికిడి.

ప్రజాసేవ చెయాల్సిన ఎమ్మెల్యే, అక్రమ డబ్బులతో భూములు కొనుగోలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. పైగా ఆ ఎమ్మెల్యేకు ప్రజలతో సన్నిహితసంబంధాలకన్నా, రియల్ మాఫియాతో రిలేషన్స్‌ అధికమట. జిల్లాల సరిహద్దులే కాదు, రాష్ట్రాల సరిహద్దులు దాటి సైతం, ల్యాండ్స్‌ జమ చేసుకున్నారట. ఒకవైపు పదవితో కమీషన్లు సంపాదిస్తూ, మరోవైపు రియల్ ఎస్టేట్ దందా ద్వారా నాలుగు చేతులా సంపాదిస్తున్నారట సదరు ఎమ్మెల్యే. ఈయనగారి వ్యవహారం అధిష్టానం దృష్టికి సైతం వెళ్లిందట. చూడాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో హైకమాండ్.

Tags:    

Similar News