దుబ్బాక ఉప ఎన్నిక ముగిసింది. ఈవీఎంలో ఓటరన్న తీర్పు నిక్షిప్తమైంది. ఫలితాల కోసం ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. గెలిచేది ఎవరంటూ, కాయ్ రాజా కాయ్ పందేలు జోరుగా సాగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీలు యమ ధీమాగా వున్నాయి. కానీ ఈ మొత్తం చర్చలో, ఒక పార్టీ పేరు పెద్దగా వినిపించడం లేదు. ఎందుకు?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దుబ్బాక భయం పట్టుకుందా....? దుబ్బాక ఉప ఎన్నికల కోసం పార్టీ మొత్తం కష్టపడ్డ మూడోస్థానానికి పరిమితం చేస్తుందని ఆందోళన చెందుతుందా....? పార్టీ మారుతారన్న అపవాదు వారిని వెంటాడుతుందా.....? అదే దుబ్బాకలో హస్తం పార్టీ కొంపకొల్లేరు చేస్తోందని హస్తం పార్టీ వణుకుతుందా.....? అవుననే అనిపిస్తోంది తాజగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ చూస్తే.
ఏదో అనుకుంటాం. ఇంకేదో ఊహించుకుంటాం. అవన్నీ అవుతాయా అన్నట్టుగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. దుబ్బాకలో ఎన్నికల సందడి స్టార్ట్ కాకముందే, కాంగ్రెస్ నేతలే తెగ హడావుడి చేశారు. రైతుల సమస్యలు, ఎల్ఆర్‌ఎస్‌లపై అరిచారు. దుబ్బాక అభివృద్ది ఏదీ అంటూ ఎలుగెత్తారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ అయితే, బైపోల్ ఎప్పుడొచ్చినా, నిలిచేది, గెలిచేది తామేనంటూ జబ్బలు చరచుకున్నారు. అప్పటికీ అభ్యర్థి ఎవరో కూడా తేల్చుకోకముందే, తేల్చుకుందాం రా అంటూ టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. దుబ్బాక ఎన్నిక అయిపోయింది. ఫలితాల కోసం ఉత్కంఠ పెరుగుతోంది. కానీ కాంగ్రెస్ పేరు మాత్రం సోయిలో లేదు.
తెలంగాణలో అన్ని పార్టీలు దుబ్బాకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టిఆర్ఎస్‌ను కార్నర్ చెయ్యడానికి, ఉప సమరం మంచి చాన్స్‌గా కాంగ్రెస్ కూడా భావించింది. అందుకు బలమైన అభ్యర్థి లేకపోవడంతో అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డిని, చివరి నిమిషంలో, కండువాకప్పి తమ అభ్యర్థిగా రంగంలోకి దించింది కాంగ్రెస్. దుబ్బాక ప్రచారం ప్రారంభంలో ధీమాగా ఉన్న కాంగ్రెస్, రోజులు గడిచేకొద్దీ, ఆ ఊపు కోల్పోతూ వచ్చింది. ఎన్నిక గడిచినా, ఓట్ల లెక్కింపుకు అంతా సిద్దమవుతున్నా, టీఆర్ఎస్, బీజేపీల్లో ఏదో ఒకటి గెలుస్తుందని అందరూ అనుకుంటున్నా, కాంగ్రెస్ గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. దుబ్బాక ఎన్నికల పోరులో ఐదు తప్పులు చేసింది కాంగ్రెస్.
మొదటి తప్పు అభ్యర్థి వేటలో ఆపసోపాలు దుబ్బాకను గెలుస్తాం గెలుస్తామంటూ బిల్డప్ ఇచ్చిన కాంగ్రెస్, అభ్యర్థిని మాత్రం ప్రజల ముందు తొందరగా నిలబెట్టలేకపోయింది. అటు టీఆర్ఎస్ నుంచి ఎవరో, బీజేపీ నుంచి ఎవరో అప్పటికే తేలిపోయింది. కానీ కాంగ్రెస్‌లో తర్జనభర్జనలే. ఆ ఆలస్యం, కాలయాపనతో, చాలా వెనకబడిపోయింది కాంగ్రెస్. అది మొదటి మిస్టేక్.
ఇక రెండో మిస్టేక్ కాంగ్రెస్ అభ్యర్థిపై రకరకాల ప్రచారాలు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, గెలుపు గుర్రమని కాంగ్రెస్ భావించింది. కానీ టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం అదే శ్రీనివాస్ రెడ్డిపై కొత్త ప్రచారం మొదలుపెట్టాయి. శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్‌లోకే పోతాడని బీజేపీ జోరుగా ప్రచారం చేసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులంతా గులాబీ గూటికే చెందినవారని, ఒకే గాటనకట్టడం, కాంగ్రెస్‌కు మైనస్‌గా మారింది. చెరుకు గెలిస్తే, ఎక్కడికీ పోడు అనే నమ్మకాన్ని జనంలో కల్పించడంలో విఫలమైంది కాంగ్రెస్. ఇది రెండో తప్పు.
కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ ఇచ్చిన వ్యూహంతో హస్తం పార్టీ మొత్తం దాదాపు నెల రోజులు దుబ్బాకలో తిష్టవేసింది. గ్రామాలను సీనియర్ నేతలకు అప్పగించడంతో లీడర్లంతా, సొంతంగా డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల ప్రచారాన్ని చేశారు. కానీ సీనియర్ల ప్రచారం జనాన్ని మెప్పించలేకపోయింది. అందరూ క్యాంపెయిన్‌లో పాల్గొన్నా, ఎవరికివారే అన్నట్టుగా తిరిగారు. సీనియర్ల సమన్వయలోపం కూడా కాంగ్రెస్ కొంపముంచింది. ఇది మూడో మిస్టేక్.
ఒకవైపు బీజేపీ అలజడి రేపుతున్నా, చాలా సింపుల్‌గా, సైలెంట్‌గా క్యాంపెయిన్ చేసింది కాంగ్రెస్. ప్రభుత్వంపై బీజేపీ వెళ్లినంత దూకుడును ప్రదర్శించలేకపోయింది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నా, తనకేంపట్టనట్టుగా వెళ్లింది. జనంలో చర్చకు దారితీసేలా అంశాలను పట్టుకోవడంలో విఫలమైంది కాంగ్రెస్. అది నాలుగో మిస్టేక్.
ఇక ఐదో మిస్టేక్. ప్రజాకర్షక నేతలు ప్రచారంలో లేకపోవడం. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అసలు క్యాంపెయిన్‌లో లేరు. మెదక్ ఎంపీగా కూడా చేసిన విజయశాంతికి, దుబ్బాకలోనూ మంచి ఫాలోయింగ్ వుంది. కానీ ఆమెను ప్రచారానికి రప్పించలేకపోయారు కాంగ్రెస్ నేతలు. అది కూడా కాంగ్రెస్‌కు మైనస్‌గా మారింది. ఇలా కర్ణుడి చావులకు సవాలక్ష కారణాలన్నట్టుగా, దుబ్బాకలో కాంగ్రెస్ వెనకబడిపోవడానికి ఎన్నో కారణాలు. ఇంకా ఫలితాలు వెల్లడికాకముందే, కాంగ్రెస్‌కు మూడోస్థానం భయం పట్టుకుందని, అదే పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. కొత్త ఇన్‌చార్జీ మాణిక్యం దుబ్బాక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయినా కాంగ్రెస్ వెనకబడిపోయిందన్న మాటలు వినపడ్తున్నాయి. ఏమో ఇంకా రిజల్ట్ రాలేదు గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా కాంగ్రెస్ సైతం, మెరుగైన ఫలితాలు సాధించొచ్చని, అదే పార్టీలో మరో వర్గం నేతలు మాట్లాడుకుంటున్నారు. చూడాలి, ఏమవుతుందో.