ఖమ్మం: మున్నేరుతో కన్నీరు

మున్నేరు వరద ముంచెత్తడానికి మానవ తప్పిదమే కారణమా? నాలాలపై అక్రమ నిర్మాణాలే ఖమ్మాన్ని ముంచాయా? భారీ వర్షమే కొంపముంచిందా? అసలు మున్నేరు ముంపునకు కారణాలేంటి?

Update: 2024-09-06 09:42 GMT

Khammam Floods: ఖమ్మం పట్టణాన్ని మున్నేరు ముంచింది. నగరంలోని 40 కాలనీల్లో 7500 ఇండ్లు దెబ్బతిన్నాయి. సుమారు 20 వేల మంది నిరాశ్రయులయ్యారు. 150 కోట్ల ఆస్తినష్టం జరిగింది. మున్నేరు వరద ముంచెత్తడానికి మానవ తప్పిదమే కారణమా? నాలాలపై అక్రమ నిర్మాణాలే ఖమ్మాన్ని ముంచాయా? భారీ వర్షమే కొంపముంచిందా? అసలు మున్నేరు ముంపునకు కారణాలేంటి?

ఖమ్మం నగరాన్ని ముంచిన మున్నేరు

మున్నేరు పరీవాహక ప్రాంతంలో 40 నిమిషాల వ్యవధిలో 40 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మున్నేరుకు ఎగువన ఉన్న ఆకేరు వాగుకు కూడా వరద పోటెత్తింది. ఖమ్మంకు సమీపాన తీర్థలలో మున్నేరులో ఆకేరు వాగు కలుస్తుంది. ఆగస్టు 31న రాత్రి 9 గంటలకు 11 అడుగులుగా ఉన్న మున్నేరు వరద ఉధృతి సెప్టెంబర్ 1వ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు 19 అడుగులకు చేరింది. ఆ తర్వాత గంటగంటకు వరద ఉధృత పెరిగి 36 అడుగులకు చేరింది. ఈ వరద నీరు కాలనీలను ముంచెత్తాయి.

అయితే ఇంత పెద్ద ఎత్తున వరద వస్తుందని ఊహించలేదు. ఇదే కొంపముంచింది. మున్నేరు వాగుకు ఇరువైపులా ఉన్న దానవాయిగూడెం, రామన్నపేట, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప, జలగంనగర్, పెద్దతండ, వెంకటేశ్వర్ నగర్, మోతీ నగర్, బొక్కలగడ్డ,మంచి కంటి నగర్, ప్రకాష్ నగర్, పంపింగ్ వెల్ రోడ్డు, ఎఫ్ సీ ఐ గోడౌన్స్, టీఎన్జీవోస్ కాలనీ,ధంసలాపురం, అగ్రహారం కాలనీ,త్రీటౌన్ లోని కొంత ప్రాంతం ముంపునకు గురయ్యాయి. రెండేళ్ల క్రితం కూడా మున్నేరు 31 అడుగుల ఎత్తులో పోటెత్తింది. 1985 కూడా ఇదే స్థాయిలో వరద పోటెత్తింది.

నాలాల ఆక్రమణలే ముంచాయా?

ఖమ్మం పట్టణానికి ఎగువన ఉన్న చెరువుల నుంచి వచ్చే నీటితో పాటు వర్షం నీరు కూడా ఖమ్మం నుంచి మున్నేరువాగులో కలుస్తుంది.అయితే ఇందుకు సంబంధించిన నాలాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ ఆక్రమణలతో వరద నీరు వెళ్లే మార్గం లేక కాలనీలను ముంచెత్తింది. రఘునాథపాలెం, బల్లేపల్లి, పాండురంగాపురం, ఖానాపురం చెరువుల మీదుగా ఖమ్మంలోని లకారం చెరువులోకి వరద నీరు ప్రవహించేందుకు వీలుగా ఫీడర్ ఛానల్స్ ఉన్నాయి.

లకారం చెరువు నుంచి ధంసలాపురం చెరువు వరకు అలుగు ఉంది. ధంసలాపురం చెరువు నిండిన తర్వాత అలుగు ద్వారా నీరు మున్నేరు వాగులో కలుస్తుంది. ఖానాపురం నుంచి లకారం చెరువు వరకు ఉన్న ఫీడర్ చానల్ వెడల్పు 40 అడుగులు. ఖమ్మం బైపాస్ రోడ్డులోని చైతన్యనగర్ కు వచ్చేసరికి ఇది 10 అడుగులకు కుంచించుకుపోయింది. ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. లకారం ట్యాంక్ బండ్ అభివృద్ది పేరుతో మట్టికట్టల నిర్మాణం నీరు వెళ్లే మార్గం లేకుండా చేసింది.

దీంతో వరద నీరు కవిరాజనగర్ లో ఇళ్లను ముంచెత్తింది. బఫర్ జోన్ లో వందలాది ఇళ్లు నిర్మించారు. మున్నేరును ఆనుకుని వెంకటేశ్వరనగర్, పద్మావతి నగర్, సారధి నగర్, మంచికంటి నగర్, బొక్కలగడ్డ, ధంసలాపురం కాలనీలున్నాయి. బఫర్ జోన్ ను ఆక్రమించి వందలాది ఇళ్లు నిర్మించారు. ఇంకా కొత్త నిర్మాణాలు కూడా చేస్తున్నారు.

కరకట్టతో మున్నేరు వరదకు అడ్డుకట్ట వేయవచ్చా?

మున్నేరు వరద ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తకుండా ఉంచేందుకు కాంక్రీట్ వాల్ నిర్మాణానికి అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం 690.52 కోట్లు మంజూరు చేస్తూ 2023 సెప్టెంబర్ 5న జీవో జారీ అయింది. పోలేపల్లి చప్టా నుంచి ప్రకాశ్ నగర్ వరకు మున్నేరుకు ఇరువైపులా గోడ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ పనుల ప్రారంభం ఆలస్యమైంది.

గోళ్లపాడు అక్విడెక్ట్ నుంచి ప్రకాశ్ నగర్ చప్టా వరకు మున్నేరుకు ఇరువైపులా 8.5 కిలోమీటర్ల పొడవు చొప్పున మొత్తం 17 కిలోమీటర్ల పొడవున కరకట్ట నిర్మించనున్నారు. ఖమ్మం నుంచి వచ్చే వర్షం నీరు, మురుగు నీరు వెళ్లేందుకు వీలుగా ఈ వాల్ పక్కనే డ్రైనేజీ పైప్ లైన్ ఏర్పాటు చేసి ధంసలాపురం ఎస్ టీ పీ వద్ద మున్నేరులోకి వదిలేలా ప్లాన్ చేశారు. మున్నేరుపై మూడు చోట్ల చెక్ డ్యామ్ లు నిర్మించాలని ప్రతిపాదించారు. వర్షాకాలం కావడంతో ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.

ప్రకృతి విలయం కంటే మానవ తప్పిదాలే మున్నేరు ముంపునకు కారణం అనడంలో సందేహం లేదు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా ప్రభుత్వం ఇకనైనా కార్యాచరణ ప్రారంభించాలి.

Tags:    

Similar News