Wedding ceremony halted amid Coronavirus terror: ఇందుగలడందు లేడని సందేహము వలదు అన్నట్లు కరోనాకి ఇక్కడ అక్కడా అనే తేడా లేదు. అది శుభాకార్యమైనా చావు ఇల్లైనా వదిలి పెట్టదు. ఎంతో ఆనందంగా పెళ్లి వేడుకలు జరుపుకుంటున్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కరోనా కలకలం రేపింది. చివరికి పెళ్లి వాయిదా వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అదెక్కడ జరిగిందో చూద్దం.
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. ఐతే జగిత్యాల జిల్లాలో వారం, పదిరోజుల క్రితం వరకు ఒక్క పాజిటీవ్ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఇటివల జరిగిన వివాహ వేడుకల్లో బయటపడిన పాజిటివ్ కేసులతో ధర్మపురి పట్టణం ఉలిక్కిపడింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో రోజుకు సగటున 200 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఐతే జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో మొన్నటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో పట్టణవాసుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఐతే వాళ్ల సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లిళ్ల రూపంలో పట్టణంలోకి ప్రవేశించిందీ మహమ్మారి. ఇటివల ధర్మపురి పట్టణంలో రెండు వివాహ వేడుకలు జరిగాయి. అందులో ఏకంగా 60 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అతిధులుగా వచ్చినవారిలో తొలుత ముగ్గురికి కరోనా ఆనవాలు కనిపించాయి. కరోనా టెస్టులు చేయించుకున్న వారికి పాజిటీవ్ రిపోర్టు వచ్చింది. దాంతో పెళ్లికి హాజరైన వారందరికి పరీక్షలు నిర్వహించగా 60 మందికి పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. వారంత క్వారంటైన్ కు తరలింప బడ్డారు.
ఇదిలా ఉండగా కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలంలోని ఓ గ్రామంలో తెల్లవార్లు పెళ్లనగా పెళ్లికుమార్తె తండ్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో చేసేది లేక పెళ్లిని మరో తేదీకి వాయిదా వేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు దేశంలో పలుచోట్ల జరుగుతునే ఉంది. పెళ్లి హడావిడిలో పడి తగు జాగ్రత్తలు తీసుకోకుండా షాపింగ్ లని, మనవాళ్లే కదా అని మాస్క్ లు వేసుకోకుండా భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు. కోవిడ్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు అన్ని వేళలా, అన్ని సందర్భాలలో కరోనా నిబంధనలు పాటించడం అందరికి క్షేమదాయకం.