Weather Updates: గత రెండు రోజులుగా రెండు రాష్ట్రాల్లో ఆగకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రజా జీవితానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు తెలుగు రాష్ట్రాలలోని వివిధ జిల్లాల్లో పరిస్థితి ఎలా వుంది అంటే..
హైదరాబాద్..
హైదరాబాద్ నగరం లో నిన్న రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నగర శివారు ప్రాంతాలతో పాటు సిటీలో చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో నగరంలోని ఆయా కూడల్ల వద్ద వరద నీరు చేరడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు హయత్ నగర్, వినాయక నగర్, రాఘవేంద్ర కాలనీలో వర్షపునీరు వచ్చి చేరడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. వరద నీటితో నగరంలోని శివారు ప్రాంతాలలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షంతో నగరంలోని నాలాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. శివారు ప్రాంతాల్లోని చాలా కాలనీలు జలమయం కావడంతో జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూం కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో డిజాస్టర్, మాన్సూన్ బృందాలను జీహెచ్ఎంసీ కమిషనర్ అప్రమత్తం చేసింది. కాగా జీహెచ్ఎంసీ అధికారులు వర్షపు నీరు ఎక్కడ ఆగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక నగరంలో అత్యధికంగా హయత్ నగర్ లో 13.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదయింది. దీంతో హయత్ నగర్ అగ్నిమాపక కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది.
మహబూబ్ నగర్..
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అర్దరాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు 10 గేట్లను అధికారుల ఎత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32 అడుగులు కాగా, ఎగువ నుంచి వస్తున్న వరదలకు ప్రాజెక్టు పూర్తిగా నిండి సెటర్లపై నుంచి నీరు జాలువారింది. దీంతో అధికారులు అత్యవసరంగా గేట్లను పైకి ఎత్తాల్సి వచ్చింది. అంతే కాక జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
కర్నూలు జిల్లా..
కర్నూలు గత రాత్రి నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు రైతులు పంటలను నష్టపోయారు. నంద్యాల డివిజన్ పరిధిలో కురిసిన భారీ వర్షానికి సుమారుగా ఐదు వేల హెక్టార్లలో పంట నీట మునిగినట్టు అంచనా. నంద్యాల వ్యవసాయ శాఖ డివిజన్ పరిధిలోని నంద్యాల, మహానంది, బండి ఆత్మకూరు, గడివేముల, పాణ్యం, బనగానపల్లె మండలాల్లో 5 వేల హెక్టార్లలో పంటనష్టం అంచనావేసారు వ్యవసాయ శాఖ అధికారులు. భారీ వర్షాలకు నంద్యాల - భీమవరం మధ్య వక్కిలేరు వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఆయా ప్రజలు మార్గమధ్యంలోనే ఉండి పోయి ఇబ్బందులకు ఎదుర్కొన్నారు.
అదే విధంగా మహానంది మండలంలో కురుస్తున్న వర్షాలకు ఫారం గ్రామం వద్ద పాలేరు వాగు పొంగిపొరలుతుంది. దీంతో మహానంది - గాజులపల్లి మధ్య పాలేరు వాగు వంతెనపై నుండి నీరు ప్రవహిస్తుంది. అంతే కాక వ్యవసాయ కళాశాల, ఇండ్ల వద్ద భారీగా వర్షపు నీరు చేరుకుంది. అదే విధంగా మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరుకుంది. మహానంది మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దేవస్థానంలోని 13 భారీ వృక్షాలు కూలిపోయాయి. ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గడివేముల మండలంలోని పెసరవాయి గ్రామంలో ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరుకుంది. గడివేముల మండలం కోరటమద్ది వద్ద వాగు పొంగిపొర్లడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇక కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా బండి ఆత్మకూరు మండలం లో 180.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయింది.
అనంతపురం జిల్లా..
అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో జనజీవనం స్థంబించి పోయింది. ప్రజలెవరూ కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.
సూర్యాపేట జిల్లా..
సూర్యాపేట జిల్లాలో పలు చోట్ల రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నడిగూడెంలో రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదయింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
ప్రకాశం జిల్లా...
ప్రకాశం జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పొదిలి మండలం బట్టువారిపల్లి దగ్గర వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్డు పైకి నీరు అధికంగా చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఇక పర్చూరులో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అదే విధంగా ఇంకొల్లు మండలం దుద్దుకూరులో చినవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పంటలన్నీ నీటమునిగాయి. అదేవిధంగా ఇంకొల్లు - గంగవరం మధ్య అప్పేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. కారంచేడు మండలం అలుగువాగు ఉదృతికి నీటమునిగిన పల్లపు పొలాలు. పర్చూరులో ఉదృతంగా ప్రవహిస్తున్న పర్చూరు వాగు. రాత్రినుండి కురుస్తున్న వర్షానికి నాగులపాలెం గ్రామం చుట్టూ నీరు చేరుకుంది.
ఇక గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి సగిలేరు వాగు పొంగి పొర్లుతుంది. అదే విధంగా మండలంలోని ఇల్లన్నీ నీట మునిగాయి. గిద్దలూరులోని పలు ప్రాంతాలు జలమయమయ్యి ఇళ్లల్లోకి వరద నీరు చేరుకుంది. దీంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పర్చూరు సబ్ డివిజన్ పరిధిలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు పొంగి పొర్లుతున్నాయి. పర్చూరు మండలం అడుసుమల్లి రామాలయంలో వర్షం ధాటికి కూలిపోయిన పరారీ గోడ .
గుంటూరు....
గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు రొంపిచర్ల మండలం మునమాక, తుంగపడు వద్ద ఉదృతంగా వాగులు ప్రవహిస్తున్నాయి. దీంతో విప్పర్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
నెల్లూరు జిల్లా..
నెల్లూరు జిల్లా రైతులను వరుణుడి గండం వెంటాడుతుంది. గత రాత్రి నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కల్లాల్లోనే ధాన్యం రాశులు ఉండడంతో డెల్టా రైతులు వర్షాలతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికే దేశ స్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా యంత్రాంగం. తాజా వర్షాలతో ధాన్యం రైతుల ఆశల పై నీళ్ళు చల్లింది.
ఒంగోలు జిల్లా..
ఒంగోలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఇంకొల్లు మధ్య రాకపోకలు స్తంభించాయి.
అనంతపురం జిల్లా..
యాడికి సమీపంలో నిట్టూరు వంక, అయ్యవారిపల్లి వంక భారీగా పారుతుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అదే విధంగా తాడిపత్రి-గుత్తి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆల్ట్రాటెక్ ఫ్యాక్టరీ వరకు వాహనాలు నిలిచిపోయాయి.