Warangal MGM Hospital Superintendent Resigns: వరంగల్ ఎంజీఎం సూపరిండెంట్ రాజీనామా
warangal mgm hospital superintendent resigns: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్ల రాజీనామాలు సంచలనం రేపుతున్నాయి. ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర మనస్తాపానికి గురై నిజామాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వర్‌రావు ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బత్తుల శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తున్నట్లు డీ.ఎం.ఈకి లేఖ రాశారు. ఆరోగ్యం సహకరించడం లేదని, తన రాజీనామాను అంగీకరించాలని శ్రీనివాసరావు లేఖలో పేర్కొన్నారు. కాగా శ్రీనివాసరావు రాజీనామాకు రాజకీయ ఒత్తిళ్ళే కారణంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు రాజీనామాకు చాలా కారణాలు ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. కరోనా కేసులు ఎక్కువ నమోదవుతుండటంతో వెంటనే కొత్త సూపరింటెండెంట్ ను నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,610 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57,142కి చేరింది. మృతుల సంఖ్య 480కి పెరిగింది. కరోనా నుంచి తాజాగా 803 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 42,909కి చేరింది. ప్రస్తుతం 13,753 మంది చికిత్స పొందుతున్నారు.