Warangal Central Jail: కాలగర్భంలో కారాగారం
Warangal Central Jail: 135 ఏళ్ల చరిత్ర గల జైలు గోడలు బద్దలయ్యాయి.
Warangal Central Jail: 135 ఏళ్ల చరిత్ర గల జైలు గోడలు బద్దలయ్యాయి. వరంగల్‌కు తలమానికంగా నిలిచిన వరంగల్ కేంద్ర కారాగారం కాలగర్భంలో కలిసిపోయింది. కేంద్ర కారాగారాన్ని మరో చోటికి మార్చి ఆ స్థానంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని తీర్చిదిద్దేందుకు పనులు కొనసాగుతున్నాయి. వరంగల్ మెడికల్ హబ్ గా మారడానికి ఈ నిర్మాణం వేదిక కాబోతుంది. దీంతో వైద్యంలో ఉత్తర తెలంగాణకు వరంగల్ పెద్ద దిక్కుగా నిలువబోతుంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎయిమ్స్ ఆస్పత్రులను సైతం తలదన్నేలా వరంగల్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం సీఎం కేసీఆర్ దీనికి భూమిపూజ చేయనున్నారు. దీనిని తన కలల ప్రాజెక్టుగా భావిస్తున్న సీఎం ఉత్తర తెలంగాణకే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఈ ఆస్పత్రిని తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. దీని కోసం ఏకంగా 30 అంతస్తుల భవనం నిర్మించాలని, చివరి అంతస్తు పైభాగంలో హెలీప్యాడ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు దాదాపు 1,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
వరంగల్‌లో 2 వేల పడకల సామర్థ్యంతో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను తీర్చిదిద్దనున్నారు. ఇందులో సుమారు 34 వరకు విభాగాలు పని చేస్తాయి. సుమారు 500 మంది వరకు వైద్యులు, వెయ్యి మందికిపైగా నర్సులు, పారామెడికల్‌తోపాటు ఇతర సిబ్బంది పని చేస్తారు. పది సూపర్ స్పెషాలిటీ విభాగాలతో రోగులకు సేవలందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
సెంట్రల్ జైలు ప్రాంతంలో నిర్మించబోయే ఈ భారీ నిర్మాణం పూర్తిగా పర్యావరణహితంగా సాగనుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే వ్యర్థమైన నీటిని శుద్ధి చేసేందుకు భారీ ఎస్టీపీతోపాటు, జీవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేస్తారు. రాష్ట్రంలోని సర్కారు దవాఖానాల్లో అతిపెద్దదిగా ఘనతకెక్కనుంది. మొత్తంగా వరంగల్ ను మెడికల్ హబ్ గా మారుస్తానని కేసీఆర్ చెప్పిన మాటలు నిజమయ్యే సమయం దగ్గర పడుతోంది.