సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. ప్లాస్టిక్ కాళ్లతో ముందడుగు...
Komaram Bheem District: వరి నూర్పిడి యంత్రంలో పడి రెండు కాళ్లు పోగొట్టుకున్న యువకుడు...
Komaram Bheem District: విధి కన్నెర్ర చేసినా సంకల్ప బలంతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆత్మ విశ్వాసం ఉంటే విధిరాతను కూడా జయించవచ్చని నిరూపించాడు. నాలుగేళ్ళ క్రితం ప్రమాదవశాత్తు రెండు కాళ్ళు పోయినా అధైర్యపడకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. ప్లాస్టిక్ కాళ్లు పెట్టినా నడవడం కష్టమని డాక్టర్లు చెప్పినా... పెట్టుడు కాళ్లతోనే ముందడుగు వేసాడు. అన్నీ తానై వ్యవసాయ పనుల్లో కుటుంబానికి సాయం చేస్తున్న యువకునిపై hmtv స్పెషల్ స్టోరీ.
కుమురం భీం జిల్లా కౌటల మండలంలోని గురుడుపేట గ్రామానికి చెందిన నికాడే విష్ణుమూర్తి అనే యువకుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వరి నూర్పిడి యంత్రంలో పడి ప్రమాదవశాత్తు రెండు కాళ్లు కోల్పోయి బతకడమే కష్టమనుకున్న పరిస్థితి నుంచి బయటపడటమే కాదు.. కృత్రిమ కాళ్లతో సొంతంగా వ్యవసాయ పనులు చేసుకోగలుగుతున్నాడు. కౌటాల మండలం గురుడు పేట గ్రామానికి చెందిన విష్ణు మూర్తి డిగ్రీ వరకు చదివాడు. వ్యవసాయంలో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవాడు. అదే క్రమంలో నాలుగేళ్ల క్రితం పొలంలో ధాన్యం కుప్పలను నూర్పిడి యంత్రంలో వేసే క్రమంలో కాళ్లను పోగొట్టుకున్నాడు.
అనంతరం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న విష్ణుమూర్తి ధైర్యంతో ముందడుగు వేశాడు. జర్మన్ టెక్నాలజీతో తయారైన కృత్రిమ కాళ్లను అమర్చుకున్నాడు. పరిస్థితులు విష్ణుమూర్తిలో మనోదైర్యాన్ని రెట్టింపు చేశాయి. కాళ్లు కోల్పోక ముందు చేసిన పనులు ఇప్పుడూ చేయగలుగుతున్నాడు. మొదట్లో ఆరు నెలల పాటు ఇబ్బందులు పడినప్పటికీ ఆ తరువాత అలవాటు పడినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అరక పట్టడం మినహా అన్ని వ్యవసాయ పనులు చేస్తున్నాడు.
ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న విష్ణుమూర్తి ఇప్పుడు పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండటంపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ప్రమాదం జరిగినా ధైర్యంగా ఎదుర్కొన్న విష్ణుమూర్తిని చూసి గర్వపడుతున్నారు. ఎంతటి కష్టంలోనైనా ఆత్మ విశ్వాసం ఉంటే విధిరాతను కూడా జయించవచ్చని నిరూపించిన విష్ణుమూర్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.