త్వరలో బీజేపీలో చేరనున్న విజయశాంతి

Update: 2020-11-08 10:53 GMT

త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు సినీ నటి విజయశాంతి. జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ‌్యక్షులు బండి సంజయ్ నడ్డా అపాయింట్‌మెంట్‌ కోరినట్లు సమాచారం. అయితే ఈనెల 20న రాములమ్మ జేపీ నడ్డా సమక్షంలో రాములమ్మ బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చేయిదాటిపోయిందని విజయశాంతి కామెంట్‌ చేయడమే దీనికి సంకేతమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌ ఇంకా ముందు వచ్చి ఉంటే.. కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగయ్యేదేమోనన్న ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. కాంగ్రెస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. టీఆర్‌ఎస్‌ పార్టీ భయబ్రాంతులకు గురిచేసి నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తోందని విజయశాంతి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరే స్థాయికి బీజేపీ వచ్చిందని రాములమ్మ చెబుతున్నారు.

విజయశాంతి రాజకీయ ఆరంగేట్రమే బీజేపీ. ఇప్పటికీ జాతీయస్థాయి నేతలతో ఆమె పరిచయాలు చెక్కుచెదరలేదు. రాజకీయాల్లో చేరి తనదైన పంథాలో గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి, బీజేపీ, టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లో పని చేయడమే కాదు సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని కూడా స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. కేసీఆర్‌కు చెల్లెలుగా పేరు తెచ్చుకున్న ఆమె, కొన్నాళ్లకు ఆయనతో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. అయితే, అప్పటి ప్రచారంలో కొన్ని సభల్లో మాత్రమే పాల్గొని టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత విజయశాంతి రాజకీయాల్లో సైలెంట్‌‌గా ఉండిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన విజయశాంతి, మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరుతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో విజయశాంతి నటనకు ప్రశంసలు లభించాయి.

Tags:    

Similar News