విజయశాంతి అలిగారు. ఆగ్రహించారు. పార్టీ మారబోతున్నారు. ఇంతవరకు ఓకే. ప్రతిరోజూ జరుగుతున్న చర్చే. కానీ రాములమ్మను పార్టీలోకి తీసుకోవడం ద్వారా బీజేపీకి ఏంటీ లాభం? ఘర్‌వాపసీతో విజయశాంతికి ఏంటీ ఫాయిదా? ఇందుకు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ తమిళనాడు వయా తెలంగాణ. విజయశాంతిపై ఈ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేస్తున్న కాషాయం స్ట్రాటజీ అదేనట. తెలంగాణతో పాటు తమిళనాడుపై విజయశాంతిని ఎలా ప్రయోగించబోతోంది కమలం? విజయశాంతి రీఎంట్రీ ఉభయతారకం ఎలా కాబోతోంది?
పొలిటికల్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి, బీజేపీ గూటికి చేరడం దాదాపు కన్‌ఫామ్. కాంగ్రెస్ పెద్దలు బుజ్జగింపులు చేస్తున్నా వినకపోవడం, తెలంగాణలో బీజేపీ బలపడిందంటూ ట్వీట్లు చెయ్యడమే అందుకు నిదర్శనం. దుబ్బాక ఫలితం తర్వాత ఎప్పుడైనా కాషాయ కండువా కప్పుకోవడం పక్కానట. ఈనెల 20యే రాములమ్మ ఘర్‌వాపసీ ముహూర్తంగా ప్రచారం జరుగుతోంది. ఇంతవరకూ ఓకే. కాంగ్రెస్‌లో తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం, సీనియర్ల గ్రూపు రాజకీయాలు, ఇలా గాంధీభవన్‌ను వీడటానికి, ఆమెకు చాలా కారణాలే వున్నాయి. ప్రతిరోజూ వాటి గురించి చర్చే. అయితే, బీజేపీలోకి వెళ్లడానికి మాత్రం, ఆమెకు అంతకుమించిన కారణాలున్నాయన్న డిస్కషన్ కూడా యమ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది.
భారతీయ జనతా పార్టీ ఎలాంటి అడుగేసినా దాని వెనక పెద్ద వ్యూహమే వుంటుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా, ఒక్క నిర్ణయంతో పలు ప్రయోజనాలు వుంటాయి. ఇప్పుడు విజయశాంతి ఘర్‌వాపసీ వెనక కూడా, కాషాయ అధిష్టానానికి అదే రేంజ్‌లో స్ట్రాటజీలున్నాయి. అదే తమిళనాడు వయా తెలంగాణ. తమిళనాడు వయా తెలంగాణ. విజయశాంతిపై బీజేపీ స్ట్రాటజీ. వినడానికి ఆసక్తికరంగా వుంది. బీజేపీ వ్యూహం కూడా అంతే ఆసక్తికరం. ఎందుకంటే, విజయశాంతి దక్షిణాదిలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళనాడులోనూ ఇప్పటికీ ఆమెకు ఫాలోయింగ్ చెక్కుచెదరలేదు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. అక్కడ అన్నాడీఎంకే దీనావస్థలో వుండటంతో, దాన్ని రీప్లేస్ చేసి, డీఎంకేకు ప్రత్యామ్నాయం కావాలన్నది కమలం వ్యూహం. ఇప్పటికే ఆ దిశగా గ్రౌండ్ వర్క్ జోరుగా సాగుతోంది. ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూను తమ పార్టీలోకి రెడ్ కార్పెట్ వేసింది బీజేపీ. మరింతమంది కాంగ్రెస్, అన్నాడీఎంకే నేతలను సైతం లాగేసుకుంటోంది. ఇప్పుడు విజయశాంతిని సైతం బీజేపీలోకి తీసుకోవడం ద్వారా, తెలంగాణే కాదు, తమిళనాడులోనూ దూసుకెళ్లొచ్చన్నది కాషాయ స్ట్రాటజీగా అర్థమవుతోంది.
తమిళనాడులో జరిగే ఏ ఎన్నికలైనా, విజయశాంతి స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. తమిళం సైతం అనర్గళంగా మాట్లాడే రాములమ్మ, ఆవేశపూరిత ప్రసంగాలకు, అరవ జనం పూనకంలా ఊగిపోతారు. ఇఫ్పుడు కుష్బూతో జతకలిసి విజయశాంతి ప్రచారం చేస్తే, తిరుగుండదన్నది బీజేపీ స్ట్రాటజీ. ఇటు తెలంగాణలోనూ బీజేపీకి పవర్‌ఫుల్ వాయిస్ దొరికినట్టవుతుంది. ఇలా విజయశాంతి చేరికతో, బీజేపీకి రెండు వైపులా ప్రయోజనాలు. అందుకే ఇటు దుబ్బాక ఫలితం, అటు రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల టైంలో, రాములమ్మ చేరిక, బీజేపీకి డబుల్ బూస్టింగ్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అయితే, గతంలో జయలలిత నెచ్చెలి శశికళను, బీజేపీ ఇబ్బందిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాములమ్మ. శశికళను జైలుకు పంపిన బీజేపీలోకి వెళ్లేదిలేదని కూడా అన్నారు. అయితే, రేపోమాపో శశికళ జైలు నుంచి విడుదలకాబోతున్నారు. రాజకీయం మారుతోంది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత, శశికళపై సానుభూతి పవనాలు పెరుగుతాయని భావిస్తున్న కమలం, నయానో భయానో ఆమెను కూడా దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందట. ఆమె కూడా బీజేపీలోకి రావడమో, లేదంటే మరో పార్టీలో వుండి, బీజేపీకి బీ టీంగా వుండటమో చేస్తారన్న చర్చ వినిపిస్తోంది. అలా విజయశాంతి రాక, తమిళనాడులో బీజేపీకి ఏ రకంగా చూసినా ప్లస్ పాయింటే.
ఇక విజయశాంతి వైపు నుంచి కూడా, ఘర్‌వాపసీతో చాలా ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే, కాంగ్రెస్ మునుగుతున్న నావగా ఆమె భావన. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే కనిపిస్తోందన్నది రాములమ్మ ఆలోచన. ఆ రకంగా బీజేపీలో వుంటే, తెలంగాణలో శక్తివంతమైన నేతగా ప్రొజెక్ట్ కావచ్చు. తమిళనాడులో బీజేపీకి ఆయుధంగా మారుతుండటంతో, ఆమె నేషనల్ లీడర్‌గా వెలుగుతారు. లోక్‌సభ లేదంటే రాజ్యసభ ద్వారా ఎంపీ అయితే, కేంద్రమంత్రి పదవి ఖాయం. కాలం కలిసొస్తే, తెలంగాణ బీజేపీకి మరో వసుంధరా రాజేగా అవతరించొచ్చు. ఇలా విజయశాంతికి సైతం, కాషాయతీర్థం పాజిటివ్‌గా కనిపిస్తోందట.
మొత్తానికి విజయశాంతి బీజేపీ ఘర్‌వాపసీ, ఉభయకుశలోపరి. తనతో ఎంతో క్లోజ్‌గా వుండే డీకే అరుణ, విజయశాంతి బీజేపీ రీఎంట్రీపై పావులు కదిపారట. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు, ఇప్పటికే విజయశాంతితో చర్చలు జరిపారు. ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అపాయింట్‌మెంట్ కోసం నిరీక్షిస్తున్న బండి సంజయ్, ఈనెల 20న ఆయన టైమ్ ఇవ్వడంతో, అదే విజయశాంతి రీఎంట్రీకి ముహూర్తంగా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అటు తమిళనాడు, ఇటు తెలంగాణలోనూ విజయశాంతిని బలమైన ఆయుధంగా ప్రయోగించేందుకు బీజేపీ ఆలోచిస్తుంటే, అటు కేంద్రం లేదంటే, ఇటు రాష్ట్రంలో కీలమైన నాయకురాలిగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు బీజేపీనే సరైన వేదికగా రాములమ్మ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి, ఏమవుతుందో.