GHMC Corona Effect: జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసుల సంఖ్యలో గందరగోళం
GHMC Corona Effect: జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసుల సంఖ్యలో వ్యత్యాసం ప్రజల్లో అయోమయానికి దారితీస్తోంది.
GHMC Corona Effect: గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అదనంగా 25 శాతం పడకలు పెంచాలని ఆదేశించింది. మొత్తం పడకల్లో 70 శాతం కరోనా రోగులకు ఉపయోగించాలని నిర్దేశించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంపిక చేసిన సాధారణ శస్త్రచికిత్సలను వెంటనే వాయిదా వేసుకోవాలని తెలిపింది. కరోనా బాధితులను ఆసుపత్రుల్లో చేర్చేందుకు ప్రత్యేక ప్రొటోకాల్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఆక్సిజన్ నిల్వలను అందుబాటులో ఉంచాలని సూచించింది. ప్రజలందరూ మాస్కులు విధిగా ధరిస్తూ, వ్యక్తిగత దూరం పాటించాలని..ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దని కోరింది.
అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసుల సంఖ్యలో వ్యత్యాసం ప్రజల్లో అయోమయానికి దారితీస్తోంది. కేవలం ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట జోన్ల పరిధిలోని కరోనా పరీక్షా కేంద్రాల్లో చేసున్న రాపిడ్ టెస్టులలో నిత్యం 300 పైగా పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అవుతున్నాయి. కానీ.. రోజూ జీహెచ్‌ఎంసీ పరిధిలో 300- 400 కేసుల వస్తున్నట్లు ప్రభుత్వం మెడికల్ బులెటిన్‌లో ప్రకటిస్తోంది. ఒక్క ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, సరూర్‌నగర్, హయత్‌నగర్ పరిసరాలలోనే యూపీహెచ్‌సీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నిత్యం 300 కేసులు దాటుతుండగా, గ్రేటర్ పరిధిలో మొత్తం కలిపి 300-400 మాత్రమే కేసులు అని ప్రకటించడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. వైరస్ సోకినవారు నిర్లక్ష్యంగా బయట తిరగకుండా చూడాల్సిన బాధ్యత యంత్రాంగానిదే. అవసరమైతే స్వచ్ఛంద సంస్థలు, కాలనీ, బస్తీ సంఘాల సహాయం తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
మలక్‌పేట, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, పాతబస్తీ పరిసరాలలో పాజిటివ్ కేసులు నిత్యం వందలాది నమోదవుతున్నా.. హట్‌స్పాట్‌లను గుర్తించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మురికివాడలు, బస్తీలు చాలా ఉన్నాయి. మార్కెట్లు, హోటళ్లు, బార్లు, వైన్స్, బస్సులు, ఆటోలు ఇలా ఎక్కడా చూసిన కరోనా నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మాస్క్ ధరించని వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. మాస్క్ పెట్టుకోనివారికి వేయి రూపాయల ఫైన్ విధిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి ఇచ్చినట్టే ఈ-చలానా జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది నిబంధనలు ఉల్లంఘిస్తున్న దీంతో కరోనా ఉధృతికి కారకులవుతున్నారు.