వనమా రాఘవ అరాచకాలు.. షాడో ఎమ్మెల్యేగా చలామణి.. భూ దందాలు, సెటిల్‌మెంట్లు, లైంగికదాడి ఆరోపణలు..!?

Vanama Raghava: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Update: 2022-01-08 10:27 GMT

వనమా రాఘవ అరాచకాలు.. షాడో ఎమ్మెల్యేగా చలామణి.. భూ దందాలు, సెటిల్‌మెంట్లు, లైంగికదాడి ఆరోపణలు..!?

Vanama Raghava: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం అరెస్ట్‌ చేసి విచారించిన పోలీసులు పాత కేసులు వెలికితీస్తున్నారు. అప్రకటిత ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనపై భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ఇసుక దందా వంటి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే సిఫార్సుతోనే వచ్చే పోలీస్ ఆఫీసర్లు, ఇతర శాఖల అధికారులు చూసి చూడనట్లు వదిలేయడం వల్లే రాఘవ అరాచకాలుకు అంతులేకుండా పోయిందని సొంత పార్టీ నాయకులే వాపోతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఒక కుటుంబం ఆత్మాహుతికి కారకుడైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవపై గతంలో ఉన్న 12 కేసుల్ని పోలీసులు వెలికి తీస్తున్నారు. కుటుంబం ఆత్మహత్యకు కారణమై పరారీలో ఉన్న రాఘవను పాల్వంచ పోలీసులు జిల్లాలోని దమ్మపేటలో అరెస్ట్‌ చేసి ఆయన మీద ఉన్న కేసులను విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. రాఘవ వల్ల ఇబ్బందులు పడ్డవారు, నష్టపోయినవారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

కొత్తగూడెం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా, భూ కబ్జాలు, ఫైనాన్షియల్ సెటిల్ మెంట్స్, మద్యం సిండికేట్లతో పాటు ప్రబుత్వ పనులు ఏవైనా రాఘవ చెప్పిన వాళ్లకే ఇవ్వాలనే రూల్ నడుస్తోంది. ఆయన చెప్పిన కాంట్రాక్టర్లకే ముందస్తుగా బిల్లులు చెల్లిస్తున్నారు. కాదన్న ఆఫీసర్లకు ట్రాన్స్‌ఫర్లు, వేధింపులు తప్పడం లేదనే చాలా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్‌ సిబ్బందిని ఎమ్మెల్యే సిఫార్సులతోనే బదిలీ చేయడం, నియమించడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగేదే. కాని ఇప్పుడు కొత్తగూడెంలో అది తారాస్థాయికి చేరి వనమా రాఘవ చెప్పిందే వేదంగా మారింది. ఆయన సిఫార్సుతో నియమితులైన పోలీసులు రాఘవ ఎన్ని అరాచకాలు చేసినా పట్టించుకోవడంలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ దైర్యంతోనే ఆస్తిగొడవల నేపథ్యంలో సాయం కోసం వచ్చిన రామకృష్ణ కుటుంబం చావుకు కారణమయ్యాడనే ఆరోపణలు వస్తున్నాయి.

ఏడాది క్రితం రాఘవ వేధింపుల మూలంగానే తాను చనిపోతున్నట్టుగా పాల్వంచకు చెందిన ఓ ఫైనాన్సియర్‌ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే భూ కబ్జాలను అడ్డుకున్నందుకు తనపై రాఘవ దాడి చేయించారంటూ పాల్వంచ మండలానికి చెందిన ఓ గిరిజన మహిళ పోలీసులకు, అలాగే, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి అదేశాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. సుమారు 15 ఏండ్ల కిందట పాల్వంచలోని ఏపీ స్టీల్స్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వ్యక్తి కూతురిపై రాఘవ లైంగిక దాడి చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఏడేండ్ల కింద నియోజకవర్గంలోని ఓ పోలీస్ ఆఫీసర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, దీంతో రాఘవను ఎదిరించలేక ఆ ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం సాగింది. సంవత్సరం కిందట తాను పిలిస్తే జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రాలేదని కోపంతో ఆయనను ముప్పతిప్పలు పెట్టగా, ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వేరే ప్రాంతానికి వెళ్ళినట్లు చెప్పుకుంటారు. ఇద్దరు మున్సిపల్ కమిషనర్లు కూడా ఇక్కడ ఉండలేక ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని వినికిడి.

రాష్ట్రంలోని అనేక చోట్ల ఎమ్మెల్యేల వారసుల ఆగడాలు బయటకు వస్తున్నాయి. అయితే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావులా బరితెగించి అరాచకాలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో తన సిఫార్సుతో నియమితులైన వారి అండ చూసుకుని ఇన్ని అరాచకాలకు పాల్పడ్డాడని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. కుటుంబం ఆత్మహత్యకు కారణమని ఆరోపణలు వచ్చిన నాలుగు రోజుల తర్వాత అతన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశాకే పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags:    

Similar News