Vaman Rao Murder Case: పుట్టా మధు రిలీజ్
Vaman Rao Murder Case: హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతులు కేసులో అరెస్టు చేసిన పుట్టా మధును రిలీజ్ చేశారు.
Vaman Rao Murder Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతులు కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్ద పల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధును పోలీసులు రిలీజ్ చేశారు. వామన్ రావు తండ్రి ఫిర్యాదు చేయడంతో అజ్ఞాతంలో ఉన్న మధును ఏపీలో భీమవరంలో స్నేహితుడి ఇంట్లో రామగుండం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడ్ని రామగుండం కమిషనరేట్‌కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు.
అయితే మూడు రోజుల నుంచి విచారణ చేసిన పుట్టా మధును కేసుకు సంబంధించి పలు అంశాలపై ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విచారణ ముగిసిన అనంతరం పోలీస్ కస్టడీ నుంచి సోమవారం అర్థరాత్రి పుట్ట మధును ఇంటికి పంపారు. ఇదే సమయంలో తిరిగి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
అయితే పుట్ట మధును మూడురోజుల పాటు విచారించిన బలమైన సాక్ష్యాలు ఏవీ బయటకు రాలేదని సమాచారం. రెండు కోట్ల లావాదేవీలకు సంబంధించి ఎక్కడా కూడా ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. ఇదిలా వుండగా పుట్ట మధు, ఆయన భార్య శైలజతో పాటు మధుకు సన్నిహితుడిగా పేరున్న కమాన్‌పూర్ వ్యవసాయ కమిటీ ఛైర్మన్ పూదరి సత్యనారాయణను విచారణ అధికారులు రోజంతా వివిధ కోణాల్లో ప్రశ్నించారు. హత్యకు ముందు, తరువాత జరిగిన ఫోన్ కాల్‌డాటాతో పాటు ఆర్థిక లావాదేవీల పైనే పోలీసులు ఆరా తీసినట్లు సమాచారం.