Urea problem plaguing Medak farmers: ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు ఎరువుల కోసం అవస్థలు పడుతున్నారు తిండి తిప్పలు మానేసి ఫర్టిలైజర్ షాపుల ముందు బారులు తీరుతున్నారు. ఉదయం నుంచి లైన్‌లో నిలుచున్నా ఒక్క సంచి కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలల ముందే స్టాక్ సిద్ధం చేశామని అధికారులు చెబుతుంటే మరోవైపు గంటల తరబడి నిలబడినా యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎరువుల వాస్తవ పరిస్థితులపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.
సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గత వర్షాకాలంతో పోలిస్తే ఈ సారి 30 శాతం మేర సాగు విస్తీర్ణం పెరిగింది. తదనుగుణంగా ఎరువుల వినియోగం కూడా పెరిగింది. దీంతో మంత్రి హరీష్ రావు ముందుగానే వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. రైతుల అవసరాలకు మించిన ఎరువులను 2నెలల ముందుగానే తెప్పించారు. అవసరానికి మించి యూరియా నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతుంటే, మరో వైపు రైతులు మాత్రం యూరియా దొరకడం లేదని వాపోతున్నారు. రెండు మూడు రోజులుగా ఎరువుల దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. యూరియా కోసం గంటల తరబడి నిలబడుతున్నామని, అయినా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఉమ్మడి మెదక్ జిల్లా అవసరాలకు చాలినంత యూరియా కేటాయింపులు ఉన్నా కరోనా కారణంగా హమాలీల కొరత వల్ల రైతులకు సకాలంలో ఎరువులు అందడం లేదు. అంతేకాకుండా ఈ కారణంగా నౌకాశ్రయాల నుంచి రవాణా కూడా ఆలస్యం అవుతోందని ఎరువుల దుకాణ యజమానులు చెబుతున్నారు. రైతులు సంయమనం పాటిస్తే సకాలంలో అందరికీ ఎరువులు అందిస్తామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.