MLC Elections 2021: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య షాక్

MLC Elections 2021: టీఆర్ఎస్‌కు మరో షాక్ ఇద్దామనుకున్న బీజేపీ ఆశలు అడియాసలయ్యాయి

Update: 2021-03-21 02:09 GMT
బీజేపీ (ఫైల్ ఫోటో)

MLC Elections 2021: సెంట్రల్‌లో ఫేమ్‌లో ఉన్న లీడ‌ర్లు అంద‌రినీ దింపి.. హైద‌రాబాద్‌లో ప‌వ‌ర్ చూపించారు. దుబ్బాక‌.. గ్రేట‌ర్ ఫలితాలతో బీజేపీ బండికి బ్రేకుల్లేకుండా పోయాయి. టీఆర్ఎస్ కారు కంటే.. బీజేపీ బండికే స్పీడెక్కువని రెచ్చిపోయారు. బీజేపీకి ఫాలోవ‌ర్స్ కూడా యూతే కావ‌డంతో.. ప‌ట్ట భ‌ద్రులు మొత్తం బీజేపీకి ఓటేస్తారు అనుకున్నారు. కానీ.. సీన్ రివర్స్ అయింది. అనూహ్యంగా టీఆర్ఎస్‌ విజ‌యం సాధించింది. మరి రానున్న సాగ‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీకి గెలిచే సత్తా చాటుతందా? తెలంగాణలో బీజేపీ ప్రజెంట్‌ సిట్యువేషన్ ఏంటీ?

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు ఎగరేసుకు పోతామనుకుని చెలరేగిన బీజేపి క్లైమాక్స్ లో తుస్సు మనిపించింది. సిటింగ్ సీటు కోల్పోడమే కాదు.. నల్గొండలో నాల్గో స్థానానికి దిగజారడం కమలం నేతలకు కాస్త దిమ్మ తిరిగే షాకే..

దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టి సంచలన విజయం నమోదు చేసుకున్న బీజేపీ.... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంచనాలకు మించి సీట్లు సాధించింది. దీంతో పార్టీ నేతల మాటలు కోటలు దాటేసాయి. బస్తీ మే సవాల్ అంటూ రంకెలు వేశారు. అటు తిరుపతి ఇటు నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో తడాఖా చూపిస్తామంటూ రెచ్చిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో తమదే ఫస్ట్ ప్లేస్ అని బీరాలు పోయారు. కానీ రోజులు ఎక్కువ గడవకుండానే వ్యవహారం అంతా మారిపోయింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కలలు కరిగిపోయాయి. ఇప్పుడు లేటెస్ట్ సిట్యువేషన్ ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్లేస్ మూడో, నాలుగో అన్నట్లు మారిపోయింది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య షాక్ తగిలింది. రెండు పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటమి పాలయింది. ముఖ్యంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. అటు నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ఏకంగా నాలుగో స్థానానికి పరిమితమయింది. అక్కడ బీజేపీ కంటే కోదండరామ్, ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందు వరుసగా నిలిచారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో తొలి ప్రాధాన్యత ఓట్లలో మొత్తం ఏడు రౌండ్లలోనూ టీఆర్ఎస్ లీడింగ్‌లో కొనసాగింది. ఐతే రెండో ప్రాధాన్యత ఓట్లపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ కమల దళం ఆశలు గల్లంతయ్యాయి. రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ తక్కువ ఓట్లు రావడంతో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలిచింది. ఇక నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గంలో కూడా బీజేపీ బోల్తా పడింది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎక్కడా ఆధిక్యం కనబరచలేదు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు, అధికార బలంతోనే టీఆర్ఎస్‌ గెలిచిందని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యోగస్తులను బెదిరించారని విమర్శించారు.

మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్‌కు మరో షాక్ ఇద్దామనుకున్న బీజేపీ నేతల ఆశలు అడియాసలయ్యాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే సాగర్ ఉపఎన్నికకు బిగ్ బూస్ట్ లభించినట్లు అవుతుందని భావించారు. కానీ సీన్ రివర్సయింది. ఈ ఓటమిపై బీజేపీ రాష్ట్ర నాయకులు విశ్లేషించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఫలితాలు సాగర్ ఉపఎన్నికపై ప్రభావం చూపబోవని. అక్కడ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీకి అంతా సీన్‌ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి సాగర్‌ పోరులో కమలం వికసిస్తోందో వాడిపోతుందో. 

Tags:    

Similar News