Encounter In Telangana : తెలంగాణ రాష్ట్రం అడవుల్లో మరోసారి తుపాకుల మోత ధ్వనించింది. పచ్చటి అడవి, పక్షుల కిలకిల రావాలతో ఉండాల్సిన అడవి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే అందమైన ప్రకృతికి ఆనవాలం ఆసిఫాబాద్ అటవీ ప్రాంతం. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లాలో కడంబ అటవీ ప్రాంతంలో మళ్లీ కాల్పుల మోత మోగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. రాత్రి వేల్లలో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
దట్టమైన అడవిలో, పులులకు ఆవాసంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రాణహిత నది సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిగిన అనంతరం భారీగా వర్షం కురుస్తుండడంతో మృతదేహాల గుర్తింపు ఆలస్యమవు తోంది. చనిపోయిన వారిలో ఒకరిని మంగిదళానికి చెందిన కోయ వర్గీస్ (ఛత్తీస్‌గఢ్)గా గుర్తించారు. మరొకరు కూడా మహిళా మావోయిస్టుగా తెలుస్తోంది. మరో ఇద్దరు కూడా మరణించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐతే ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు భాస్కర్ అలియాస్ అడెల్లు తృటిలో తప్పించుకున్నాడు. ఘటన స్థలంలో ఏకే 47 స్వాధీన పర్చుకున్నట్లు తెలుస్తోంది. తప్పించుకున్న తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు భాస్కర్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు.
కుమురం భీం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ, రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారా యణ, ఏఎస్పీ సుధీంద్ర సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 25 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న భాస్కర్ తలపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. కాగా అతడు తప్పించుకోవడంతో పట్టుకునేందుకు కడంబ అటవీ ప్రాంతాన్ని గ్రేహౌండ్స్ జల్లెడ పడుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఎనిమిది గ్రేహౌండ్స్ బృందాలు, ఆరు స్పెషల్ పార్టీలు పాల్గొన్నాయి. ప్రస్తుతం 400 మంది సిబ్బంది అభయారణ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించి మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్నారు. కాల్పుల్లో మృతి చెందిన వర్గీస్ ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఏరియా కమిటీ సారథిగా నియమితులయ్యారు. అసిఫాబాద్‌లో తప్పించుకున్న మావోయిస్టులు వరంగల్ జిల్లా వైపు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.