తిరుమలలో ప్రత్యేక దర్శనంకై…

Update: 2019-08-07 10:42 GMT

ప్రపంచ స్థాయిలో కలియుగ వైకుంఠం, ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామీని దర్శించుకోవడానికి టి.ఎస్‌.ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే యాత్రికులకు ప్రత్యేక దర్శన ప్రవేశం కల్పించాల్సిందిగా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శ్రీ వేములు ప్రశాంత్‌ రెడ్డి టి.డి.డి ఛైర్మన్‌ను కోరారు. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి సగటున 10 వేల మంది యాత్రికులు ప్రతిరోజు తిరుమలను సందర్శిస్తారని, తిరుమలకు నడుపుతున్న 32 టి.ఎస్‌.ఆర్టీసీ సర్వీసుల్లో దాదాపు వెయ్యి మందికి పైగా ప్రయాణీకులు ప్రతిరోజు తిరుమలకు వెళ్లడం జరుగుతుందని వివరించారు. ప్రజా రవాణా, పర్యాటక సంస్థలను ప్రోత్సహించే ఉద్ధేశంతో టి.టి.డి తిరుమల దర్శనం కోసం ప్రత్యేక ప్రవేశం టిక్కెట్ల ను మంజూరు చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎ.పి.ఎస్‌.ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకునే ప్రయాణీకులకు ఈ వెసలుబాటు అందుబాటులో ఉన్నదని, ఈ విధానాన్ని టి.ఎస్‌.ఆర్టీసీ ప్రయాణీకులకు కూడా విస్తరించాలని అభ్యర్థించారు. మంత్రి టి.టి.డి ఛైర్మన్‌కు లెటర్‌ రాయడమే కాక ప్రత్యేకంగా ఫోన్‌ చేసి కూడా మాట్లాడారు. టి.ఎస్‌.ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి తిరుమలకు చేరుకునే యాత్రికులకు ప్రతి రోజు వెయ్యి ప్రత్యేక దర్శన టిక్కెట్లను కేటాయించాలని కోరుతూ, ఈ విధానంతో సంస్థను ప్రయాణీకులు మరింత ఆదరించడంతో పాటు వారికీ సౌలభ్యం కూడా ఉంటుందని వివరించారు. అలాగే, నూతనంగా బాధ్యతలు స్వీకరించి సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టిన ఛైర్మన్‌ శ్రీ సుబ్బారెడ్డికి మంత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.  

Tags:    

Similar News