TSRTC: హైదరాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కర్
TSRTC: మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టాలంటూ మంత్రి కేటీఆర్ కు ఓ పౌరుడు ఇటీవల విజ్ఞప్తి చేశాడు.
TSRTC: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సుల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి రాజధానికి వచ్చే ప్రజలు డబుల్ డెక్కర్ బస్సులు చూడకుండా వెళ్లేవారు కాదు. వీలైతే డబుల్ డెక్కర్ బస్సు ఎక్కి నగర అందాలను చూసేవారు. మెహదీపట్నం – సికింద్రాబాద్ స్టేషన్, సికింద్రాబాద్–జూపార్కు, సికింద్రాబాద్–సనత్‌నగర్, మెహిదీపట్నం–చార్మినార్ మార్గాల్లో 16 ఏళ్ల క్రితం వరకు డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టాయి. ఆ బస్సు అప్పర్ డెక్‌లో కూర్చుని ట్యాంక్‌బండ్ మీదుగా ప్రయాణిస్తుంటే ఆ సరదానే వేరుగా ఉండేది. రాష్ట్ర ప్రజలతో అంత పెనువేసుకుపోయిన డబుల్ డెక్కర్ బస్సులకు అంతటి ప్రాధాన్యత వుంది. నగరంలో ఫ్లైఓవర్లు రావడంతో వాటి ప్రయాణాలకు అడ్డంకిగా మారింది. ఈ బస్సులను పక్కన పెట్టేయడానికి ఇదొక ప్రధాన కారణం. అయితే, మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టాలంటూ మంత్రి కేటీఆర్ కు ఓ పౌరుడు ఇటీవల విజ్ఞప్తి చేశాడు. ఈ విన్నపం పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తాను డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగిన అనుభూతులను గుర్తుకు తెచ్చుకున్నారు. అంతేకాదు అనువైన రూట్లలో ఈ బస్సులను తిప్పే అంశాన్ని పరిశీలించాల్సిందిగా తెలంగాణ ఆర్టీసీ అధికారులను కోరారు.
నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ...
కానీ సాధారణ బస్సులతో పోల్చుకుంటే ఈ బస్సుల నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ. అందుకే అప్పట్లో డిమాండ్ ఉన్నప్పటికీ నష్టాలు భరించలేక ఆర్టీసీ వాటిని వదిలించుకుంది. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ ఈ బస్సులు తీసుకుంటోంది. ఎంత కొత్తతరం నమూనా బస్సు అయినా.. నిర్వహణ వ్యయం మాత్రం తడిసి మోపెడవుతుందని అధికారులు భయపడుతున్నారు. తొలుత 40 బస్సులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలనే ఆదేశాలు వచ్చినా.. ఖర్చుకు భయపడి 25 మాత్రమే కొంటున్నారు. ఒకవేళ నష్టాలు వస్తే వాటికి తగ్గట్టుగా ప్రభుత్వం రాయితీలు ఇస్తే అవసరమైనన్ని కొనాలని అధికారులు భావిస్తున్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మెట్రో నగరాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నహైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఐకానిక్ గా నిలవనుంది డబుల్ డెక్కర్ బస్సు.