TSRTC Cargo And Parcel Services: తెలంగాణాలో ఫలితాలిస్తున్న ఆర్టీసీ కార్గో.. మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు
TSRTC Cargo And Parcel Services: తెలంగాణా ఆర్టీసీ ప్రారంభించిన కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఇది మంచి ఆదాయాన్నే రాబట్టింది... కరోనా ఫ్రీ అయితే దీనిని మరిన్ని దూరప్రాంతాలకు విస్తరిస్తే మరింత ఆదాయం పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది
TSRTC Cargo And Parcel Services: తెలంగాణా ఆర్టీసీ ప్రారంభించిన కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఇది మంచి ఆదాయాన్నే రాబట్టింది... కరోనా ఫ్రీ అయితే దీనిని మరిన్ని దూరప్రాంతాలకు విస్తరిస్తే మరింత ఆదాయం పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది. నిన్నటిదాకా ప్రయాణికులను చేరవేసిన ఆర్టీసీ.. ఇప్పుడు ప్రైవేటు ఏజెన్సీలకు దీటుగా సరుకు రవాణా కొనసాగిస్తున్నది. గతంలో పార్సిల్-కొరియర్ సర్వీసులను ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చారు. ఇప్పుడు సొంతంగా ఈ సేవలను నిర్వహిస్తుండటంతో పార్సిల్-కొరియర్-కార్గో (పీసీసీ) సేవలతో రోజుకు రూ.10 లక్షల నుంచి 11 లక్షల వరకు సంస్థకు ఆదాయం సమకూరుతున్నది. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో సిటీ బస్సులు లేవు. జిల్లాల్లో తిరుగుతున్న బస్సుల్లోనూ 40 శాతంలోపే ఆక్యుపెన్సీ ఉంటున్నది. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో చేసిన కార్గో సర్వీసుల ఆలోచన.. ప్రస్తుతం ఆర్టీసీకి చీకట్లో చిరు దివ్వెలా మారింది.
సరుకు- పార్సిల్- కొరియర్ (పీసీసీ) రవాణాలో ఆర్టీసీ దూసుకుపోతున్నది. ప్రైవేటు రేట్లతో పోలిస్తే ఆర్టీసీ పీసీసీ సేవల చార్జీలు తక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సగటు వ్యక్తి మొదలు హైదరాబాద్‌లో ఉండే పెద్ద పారిశ్రామికవేత్త వరకు ఈ సేవలను వినియోగిం చుకునేందుకు అవకాశమున్నది. 160 నుంచి 170 కార్గో బస్సులను వివిధ ప్రభుత్వ శాఖల వస్తు రవాణాకు వినియోగిస్తున్నారు. ప్రైవేటు సంస్థలకు అవసరమైన వస్తు రవాణా ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇంటి సామాను తరలించేందుకు కూడా ఆర్టీసీ కార్గోను ఆశ్రయిస్తుండటం మంచి పరిణామం. వీటికితోడు సాధారణంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే బస్సుల డిక్కీల్లోనూ నిర్ణీత మేర వస్తువులను రవాణాచేస్తున్నారు. దీంతో గంటల వ్యవధిలోనే ఇవి గమ్యస్థానాలకు చేరుతుండటంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ప్రస్తుతం బస్టాండు నుంచి బస్టాండు వరకు రవాణా జరుగుతున్నది. మున్ముందు విస్తరణ మరింత పెరిగేకొద్దీ డోర్ డెలివరీ సౌకర్యాన్ని కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
పార్సిల్- కొరియర్‌కు బ్రహ్మాండమైన స్పందన
గతంలో ఆర్టీసీ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పార్సిల్- కొరియర్ సేవలను నిర్వహించేది. తద్వారా సంస్థకు నెలకు రూ.70 లక్షలవరకు ఆదాయం వచ్చేది. కానీ ఆర్టీసీ సొంతంగా పార్సిల్- కొరియర్ సేవలు ప్రారంభించిన తర్వాత తొలిరోజు రూ.15 వేలతో మొదలైన ఆదాయం రోజుకు రూ.8 లక్షలకు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 147 బస్‌స్టేషన్లలో పార్సిల్- కొరియర్ సేవలు కొనసాగుతున్నాయి. ఈ రంగంలో డోర్ డెలివరీకి ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో సంస్థ ఉద్యోగులను కూడా భాగస్వాములను చేస్తున్నారు. సాధారణ బస్సుల్లోనే పార్సిల్- కొరియర్‌కు ప్రత్యేకంగా బాక్సులను ఏర్పాటుచేశారు. దీంతో గంటల వ్యవధిలోనే గమ్యస్థానాలకు చేరుతున్నాయి. ప్రస్తుతానికి ఫోన్ నంబర్ల ద్వారా బస్‌స్టాండుల్లోనే పార్సిల్- కొరియర్‌లను ఉంచి అందిస్తున్నారు. మున్ముం దు డోర్ డెలివరీ కూడా చేయనున్నారు. ఇక వస్తు రవాణా (కార్గో) సేవలతో సంస్థకు రోజుకు రూ.2 లక్షల నుంచి 3 లక్షల ఆదాయం సమకూరుతున్నది. హైదరాబాద్‌లో సిటీ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సుల పునరుద్ధరణ జరిగి.. సాధారణ పరిస్థితులు నెలకొంటే ఆదాయం భారీగా పెరుగనున్నదనేది సుస్పష్టం.
పార్సిల్ సర్వీసు రేట్లు ఇలా..
> 0- 75 కిలోమీటర్ల వరకు 0- 25 కిలోల బరువున్న పార్సిల్‌కు చార్జి రూ.50. ఆపై ప్రతి 25 కి.మీ.లకు చార్జి అదనంగా రూ.25 పెరుగుతుంది. దూరం, బరువు పెరిగే కొద్దీ చార్జీలు పెరుగుతాయి.
> పార్సిల్ బరువు టన్నుకు మించితే 10 కిలోమీటర్ల వరకు కనిష్ఠంగా రూ.170. 25 కి.మీ.ల వరకు రూ.200.. ఆపై ప్రతి 5 కి.మీ.లకు అదనంగా రూ.15.
> ఆహార పదార్థాల రవాణాకు 100 కి.మీ.ల వరకు 25 కిలోల బరువుంటే హమాలీ, అన్నిరకాల చార్జీలు కలిపి రూ.40. 26- 50 కిలోలవరకు రూ.50, 51- 80 కిలోలవరకు రూ.60. దూరం పెరిగే కొద్దీ ప్రతి అదనపు 100 కిలోమీటర్లవరకు అదనంగా రూ.10.
కొరియర్ చార్జీలు ఇలా..
> తెలంగాణ రాష్ట్ర పరిధిలో 250 గ్రాములవరకు బరువు ఉండే కవర్‌కు రూ.50. ప్రతి అదనపు 250 గ్రాములకు అదనంగా రూ.25.
> అంతర్రాష్ట్ర పరిధిలోనైతే 250 గ్రాములవరకు బరువుండే కవర్‌కు రూ.75.. ప్రతి అదనపు 250 గ్రాములకు అదనంగా రూ.25. డ్రైవర్‌కు అదనంగా రూ.5 చెల్లించాలి. ఒకవేళ కండక్టర్ ఉంటే అందులో నుంచి అతనికి పంపిణీ అవుతుంది. కస్టమర్ నుంచి కొరియర్ తీసుకొని తిరిగి అడ్రస్‌కుచేర్చేందుకు డెలివరీ చార్జీలను ఆ సమయంలో నిర్ధారిస్తారు.
బల్క్ రవాణా చార్జీలు ఇలా..
> బల్క్ రవాణాకు లోడింగ్, అన్‌లోడింగ్, జీఎస్టీ కలుపుకొని టన్నుకు 100 కి.మీ.ల దూరంవరకు రూ.824. ఇందులో లోడింగ్, అన్‌లోడింగ్‌కు రూ.200. ఇది వినియోగదారుడి ఇష్టం. తానే ఈ రెండు ప్రక్రియలు నిర్వహించుకుంటే రూ.624 ఆర్టీసీకి చెల్లించాలి.
నెలవారీగా కంపార్ట్‌మెంట్లు
> ఏసీ బస్సుల్లో సామగ్రి రవాణాకు డిక్కీలను వినియోగదారులకు నెలవారీ ప్రాతిపదికన కూడా కేటాయించనున్నారు.
> రాత్రివేళ బస్సు సర్వీసుల్లోని డిక్కీలకు కిలోమీటరుకు కనిష్ఠంగా రూ.3, డే సర్వీసుల్లో కనిష్ఠంగా రూ.2.
> నెలవారీగా ఈ డిక్కీలను కేటాయించేందుకు ముందుగానే నెల మొత్తాన్ని పూచీకత్తుగా జమచేయాలి. సాధారణంగా రోజువారీగా డిక్కీని బుక్‌చేసుకునేందుకు కిలోమీటరుకు రూ.5 చెల్లించాలి.
సంస్థను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ ఆలోచన
కరోనా నేపథ్యంలోనూ ఆర్టీసీ ఆర్థికంగా ఊరట పొం దుతున్నదంటే అది పార్సిల్-కొరియర్-కార్గో సేవల ద్వా రానే. సీఎం కేసీఆర్ ఆలోచన సంస్థను ఆదుకుంటున్నది. ప్రస్తు తం సంస్థలో పీసీసీ చాలా కీలకమైన విభాగంగా మారింది. అందుకే దీనికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టును కూడా మంజూరుచేస్తున్నది. ఆర్థికశాఖ క్లియరెన్స్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారిగా ఉన్న కృష్ణకాంత్ ఈడీ స్థాయిలో ఈ సేవలు అందిస్తున్నారు. ప్రజలు ఆర్టీసీ పీసీసీ సేవలను మరింత సద్వినియోగం చేసుకొంటే సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. - అజయ్‌కుమార్, రవాణాశాఖ మంత్రి