TSRTC : కరోనా లాక్ డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా వ్యవస్థను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం పెద్ద యుద్దం చేసి నెమ్మదిగా విజయం సాధిస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం లాక్ డౌన్ ను సడలించింది. అందులో భాగంగానే రావాణ వ్యవస్థను పునరుద్దరిస్తుంది. ముందుగా జిల్లాల నుంచి నగరానికి బస్సులను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం తరువాత మెల్లిగా హైదరాబాద్ నగరంలో బస్సులను ప్రారంభించింది. ఇప్పుడు ఇదే క్రమంలో ఈ రోజు ఇతర రాష్ట్రాలకు బస్సులను ప్రారంభించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఎక్కువగా విస్తరిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రభుత్వం బస్సులను నడిపేందుకు మొగ్గుచూపడం లేదు. కాని ఇరుగు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రకు మొత్తం 600 బస్సు సర్వీసులను ప్రారంభించింది.
దీంతో ఈ రోజు నుంచి ఆయా సర్వీసులు ప్రజలకు సేవలను అందించనున్నాయి. ఆరు నెలల కాలం తరువాత అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఈ రోజు ఉదయం 5.30కి ప్రారంభం అయ్యాయి. ఉదయాన్నే మొదటి సర్వీసులు మొదలయ్యాయి. ఈ సర్వీసులను ప్రారంభించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగు రోజుల కిందట గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ రోజు నుంచి బస్సులు రోడ్లెక్కాయి. ప్రారంభం అయిన బస్సుల్లో ఈ రోజు కర్ణాటకలోని బెంగళూరు మినహా మైసూరు, గంగావతి, బీదర్, గుల్బర్గా, రాయచూరు ప్రాంతాలకు బస్సులు నడుస్తాయి. ఇటు మరో రాష్ట్రం మహారాష్ట్రలో ముంబై, పుణె, నాగపూర్, నాందేడ్, చంద్రపూర్ షిర్డీలకు బస్సులు వెళ్తాయి. ఈ బస్సు సర్వీసులను ప్రారంభించడంతో రూ.40లక్షల నుంచి రూ.50లక్షల దాకా ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇక ఈ బస్సుల్లో టీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల భద్రత కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తుంది. అలా చేసినట్లుగా స్టిక్కర్ అంటిస్తున్నారు.