TG Govt Help Flood Victims: వరద బాధితులకు భారీ ఊరట. రూ. 16,500లతోపాటు ఇందిరమ్మ ఇల్లు
TG Govt help Flood Victims:భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర సర్కార్ అండగా నిలిచింది. వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ. 16,500 నగదు తక్షణమే అందించాలని నిర్ణయించుకుంది. నేరుగా వారి బ్యాంకు అకౌంట్లోనే నగదును జమ చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు వరద నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి.
TG Govt help Flood Victims: తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్నో కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. తీవ్ర వర్షాలకు ఎన్నో కుటుంబాలకు తమ వాళ్లను కోల్పోయాయి. ఈ క్రమంలోనే వారికి అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి కుటుంబానికి రూ. 16,500 చొప్పున సాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ సాయం చివరి బాధితుడి వరకూ అందుతుందని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వర్షాల వల్ల నష్టపోయామని ఏ ఒక్క కుటుంబం బాధపడాల్సిన అవసరం లేదన్నారు. భారీ వర్షాలపై సోమవారం సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు, వరదలు తీవ్ర నష్టం కలిగించాయి. ఎంతో మంది తీవ్రంగా నష్టపోయారు. దీంతో అన్ని జిల్లాలు వర్షాలు, వరదలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వరదల వల్ల జరిగిన నష్టాలను అధికారులు పక్కగా అంచనా వేయాలని ఆదేశించారు. ఒక్కో శాఖ పరిధిలో ఎంత నష్టం జరిగింది..ఎన్ని నిధులు కావాలన్న దానిపై పూర్తి స్థాయిలో నివేదిక రూపొందించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నివేదికలో కేంద్రానికి పంపాల్సిన అంశాలను పొందుపర్చాలని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధికులకు యుద్ధ ప్రాతిపదికన ఆర్థిక సాయం అందించాలని మంత్రి సూచించారు.
కాగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆ కుటుంబాలకు రూ. 5లక్షల ఆర్థిక సాయంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందించాలని మంత్రి తెలిపారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు.