TS ECET 2020: నేటి నుంచి ప్రవేశపరీక్షలు.. నేడు ఈసెట్, రేపు జేఈఈ మెయిన్స్
TS ECET 2020: ఎట్టకేలకు ఎంట్రన్స్ పరీక్షలను తెలంగాణా ప్రభుత్వం తెరతీసింది... కరోనా నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన ఈ పరీక్షలను నేటి నుంచి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిద్ నిబంధనలను అనుసరించి,
TS ECET 2020: ఎట్టకేలకు ఎంట్రన్స్ పరీక్షలను తెలంగాణా ప్రభుత్వం తెరతీసింది... కరోనా నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన ఈ పరీక్షలను నేటి నుంచి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిద్ నిబంధనలను అనుసరించి, ప్రతీ విద్యార్థి పరీక్షలకు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా వాయిదాపడిన వివిధ ప్రవేశ పరీక్షలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. రాష్ట్ర, జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే సెట్ల సీబీటీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఈసెట్, మంగళవారం జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశాల (లాటరల్ ఎంట్రీ) కోసం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఈసెట్-2020 కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ)విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 28,015 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. వారిలో దాదాపు 26,500 మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని కన్వీనర్ ప్రొఫెసర్ మంజూర్‌హుస్సేన్ ఆదివారం తెలిపారు. పరీక్షల కోసం తెలంగాణ, ఏపీలో కలిపి 56 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు (రెండుపూటలు) పరీక్షలు ఉంటాయి. పరీక్ష సమయానికి గంట ముందుగానే కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు.
రేపు జేఈఈ మెయిన్
దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం మంగళవారం నుంచి సెప్టెంబర్ ఆరు వర కు జరుగనున్న జేఈఈ మెయిన్ పరీక్షలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు ఏర్పాట్లు చేశా రు. ఐఐటీ ఢిల్లీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీబీటీ విధానంలో ఒక్కరోజులో 85 వేలమంది మెయిన్ పరీక్షలకు హాజరుకానున్నా రు. తెలంగాణ నుంచి 67,319 మంది, దేశవ్యాప్తంగా 8.58 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో కేంద్రాలున్నాయి.
విద్యార్థులకు సూచనలు
నిమిషం నిబంధన కచ్చితంగా పాటిస్తారు. గేట్లుమూసిన తర్వాత విద్యార్థులకు అనుమతి ఉండదు.
పరీక్షలు పూర్తికాక ముందు విద్యార్థులను బయటకు పంపే ప్రసక్తే ఉండదు.
లాగ్‌టేబుళ్లు, క్యాలిక్యులేటర్లు, మొబైల్‌ఫోన్లు, వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.
అడ్మిట్ కార్డు, సరైన గుర్తింపు కార్డులేకుండా పరీక్ష హాలులోకి పంపించరు.
డౌన్‌లోడ్ చేసుకొన్న కొత్త హాల్‌టికెట్‌తోపాటు సెల్ఫ్ డిక్లరేషన్‌ను అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.
హాల్‌టికెట్లపై ఇన్విజిలేటర్ సమక్షంలో అభ్యర్థి తప్పనిసరిగా సంతకం చేయాలి.
విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను తెచ్చుకోవాలి.
విద్యార్థులు గోరెంటాకు, ఇంకు వంటి ఏదై నా డిజైన్లతో పరీక్షలకు రావడం నిషేధం.
హాల్‌టికెట్‌లో పేర్కొన్న సూచనలను విద్యార్థులు విధిగా పాటించాలి.
పరీక్ష కేంద్రాల్లో పాటించాల్సిన కొవిడ్ నిబంధనలు
విద్యార్థులు, అధ్యాపకులు, పరీక్షల సిబ్బంది, కాలేజీ సిబ్బంది కొవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
విద్యార్థులు ఇంటినుంచి తెచ్చుకున్న మాస్కులను వదిలేయాలి. పరీక్షా కేంద్రంలో మాస్కులు పంపిణీ చేస్తారు.
అందరూ మాస్కులు ధరించాలి. మాస్కులు, శానిటైజర్ బాటిల్, వాటర్‌బాటిల్‌తోపాటు గ్లౌజులు తెచ్చుకోవాలి.
పరీక్ష కేంద్రాల్లో శానిటైజర్లు ఏర్పాటుచేయాలి. అక్కడ విద్యార్థులు, సిబ్బంది గుంపులుగా తిరుగడం నిషేధం
అందరికీ థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తారు.