Eetala Rajendar: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ శనివారం ఉదయం అసెంబ్లీ కార్యదర్శికి లేఖ అందించారు ఈటల. ఆ వెంటనే రాజీనామాను ఆమోదించిన స్పీకర్, హుజూరాబాద్ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తెలియచేశారు. ఈటల సోమవారం బీజేపీలో చేరనున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఒక కుదుపు మొదలైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఈ ఏడేళ్ళ కాలంలో ఒక ఎమ్మెల్యే తప్పుకోవడం ఇదే మొదటిసారి. ఏడు సంవత్సరాలుగా కేసీఆర్ మంత్రివర్గంలో కొనసాగిన ఈటల రాజేందర్‌ను.. అసైన్‌మెంట్ భూముల అక్రమాల ఆరోపణలపై మంత్రివర్గం నుంచి తొలగించారు. మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత వివిధ పార్టీల నేతలు, అభిమానులతోనూ చర్చలు జరిపిన ఈటల ఆఖరుకు బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. టీఆర్‌ఎస్‌పై పోరాడేందుకు బీజేపీ మాత్రమే సరైన వేదికగా ఈటల భావించారు. అందులో భాగంగానే బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌తోను...ఇతర అగ్ర నేతలతోనూ సంప్రదింపులు జరిపారు. తనపై అన్యాయంగా అసైన్‌మెంట్ భూముల ఆరోపణలు చేయించి..పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని ఈటల రగిలిపోతున్నారు. టీఆర్‌ఎస్ వల్ల వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..మళ్లీ స్వయంగా గెలిచి చూపించాలని నిర్ణయించుకున్నారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ నాయకత్వాన రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విజయం సాధించిన ఈటల.. ఇప్పుడు తన ఆత్మాభిమానం కోసం ఉద్యమ పార్టీకి వ్యతిరేకంగా అసెంబ్లీకి రాజీనామా చేశారు.
బీజేపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్న ఈటల రాజేందర్ శనివారం అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ ఫార్మేట్‌లో కార్యదర్శికి రాజీనామా లేఖ సమర్పించారు. స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరినా...కోవిడ్ కారణంగా ఆ అవకాశం దొరకలేదు. దీంతో అసెంబ్లీ కార్యదర్శికే సమర్పించారు. ఆ తర్వాత కాసేపటికే ఈటల రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. అదేవిధంగా హుజూరాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ వెలువరించి..ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తెలియచేశారు అసెంబ్లీ కార్యదర్శి. రాజీనామా సమర్పించడానికి ముందు అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్ దగ్గర అమరవీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించారు ఈటల. వామపక్షవాది అయి ఉండి...బీజేపీలో ఎలా చేరతారంటూ వస్తున్న ప్రశ్నలకు ఈటల సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను లెఫ్టిస్టును కాదు, రైటిస్టును కాదని చెప్పారాయన. నియంత పాలన నుంచి తెలంగాణను విముక్తం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు ఈటల.
సోమవారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్. బీజేపీలో చేరే ముందే అసెంబ్లీ సీటుకు రాజీనామా చేయాలన్ని నిర్ణయాన్ని అమలుచేశారాయన. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఈటల ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్‌పీ అధ్యక్షురాలు ఒకరు కూడా హస్తిన వెళ్ళారు. వీరంతా కలిసి బీజీపీలో చేరతారు. కోవిడ్ కారణంగా ఇప్పుడు కొద్ది మంది మాత్రమే ఢిల్లీ వెళుతున్నామని..త్వరలో రాష్ట్రం నలుమూలల నుంచి బీజేపీలో చేరతారని ప్రకటించారు ఈటల.
తెలంగాణ ఏర్పడ్డాక అనేక ఉప ఎన్నికలు జరిగాయి. కాని ఈటల రాజీనామా కారణంగా రానున్న ఉప ఎన్నిక ప్రత్యేకత సంతరించుకుంది. హుజూరాబాద్‌లో ఈటల నామమాత్రమేనని..అక్కడ పార్టీయే బలమైన శక్తి అని నిరూపించడానికి కేసీఆర్ సంసిద్ధమయ్యారు. అయితే తెలంగాణలో మరో ఆత్మగౌరవ ఉద్యమానికి ఇదే నాంది అవుతుందని ఈటల అంటున్నారు. అదే సమయంలో దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత చల్లబడిన కాషాయ సేనకు మరో అగ్ని పరీక్ష ఎదురు కాబోతోంది.