MLC Elections 2021: రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం

MLC Elections 2021: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల స్థానం గులాబీ కైవసం

Update: 2021-03-21 01:41 GMT

తెరాస (ఫైల్ ఫోటో)

MLC Elections 2021: నాలుగురోజుల పాటు నరాలు తెగేలా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగింది. నువ్వానేనా? అన్నట్లుగా సాగిన పట్టభద్రుల స్థానాలను అధికార పార్టీ కైవసం చేసుకుంది. రెండు స్థానాల్లో గులాబీ గుబాళించింది.

హైదరాబాద్ - రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ కుమార్తె, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి విజయదుందుభి మోగించారు. బీజేపీ ప్రత్యర్థి రామచంద్రరావు కంటే 20, 820 ఓట్లకు పైగా మెజార్టీ సాధించి గెలుపొందారు. ఓట్లలెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వాణిదేవియే ఆధిక్యంలో కొనసాగింది.

తొలి ప్రాధాన్యత ఓటులో ఎలాంటి ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత లెక్కింపు అనివార్యమైంది. వాణీదేవికి తొలి ప్రాధాన్యతలో 1,12,689ఓట్లు, రెండో ప్రాధాన్యతలో 36,580 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 1,49,269 ఓట్లు వచ్చాయి. తుది అభ్యర్థి రామచందర్ రావును ఎలిమినేట్ చేసే సమయానికి 1,89,339 ఓట్లు టీఆర్ఎస్‌ సాధించింది. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు లభించిన 1,04,668 ఓట్లలో టీఆర్ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి రెండో ప్రాధాన్య ఓట్లు 40,070 దక్కాయి. మ్యాజిక్ ఫిగర్ 1,68,520 ఓట్ల కంటే.. 20,820 ఓట్లు అధికంగా సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సమీప ప్రత్యర్థి రామచంద్రరావు మొదటి ప్రాధాన్యతలో 1,04,668 ఓట్లు, రెండో ప్రాధాన్యతలో 32,898 ఓట్లు వచ్చాయి. మొత్తంగా రామచంద్రరావుకు 1,37,566 ఓట్లు పోలయ్యాయి.

హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూరు స్థానాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడంతో టీఆర్ఎస్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణీ దేవి.. సీఎం కేసీఆర్​ను ప్రగతిభవన్​లో కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ్చి, అన్నీతానై తన గెలుపునకు కారణమైన సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వాణిదేవికి అభినందనలు తెలిపిన సీఎం.. శాలువాతో ఆమెను సత్కరించారు. విజయాన్ని కట్టబెట్టిన అన్ని వర్గాల ప్రజలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం పని చేసిన మంత్రులు, నేతలు, కార్యకర్తలకు సీఎం అభినందనలు తెలిపారు.

ఇక నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల స్థానాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. రౌండ్ల వారి ఓట్ల వివరాలను పల్లాకు కలెక్టర్‌ ప్రశాంత్ జీవన్ పాటిల్ అందజేసి అభినందించారు. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నపై 12,806 ఓట్ల మెజారిటీతో పల్లా గెలుపొందారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,61,811 ఓట్లు రాగా... తీన్మార్‌ మల్లన్నకు 1,49,005 ఓట్లు వచ్చాయి.

మొత్తంగా దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢీలా పడ్డ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బిగ్ బూస్టింగ్ అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ముందు సాధించిన ఈ విజయం ఆ పార్టీలో ఆత్మస్థైర్యాన్ని పెంచేదిగా మారింది.

Tags:    

Similar News