నామినేటెడ్ పదవుల భర్తీకి టీఆర్ఎస్ సన్నాహాలు
* భారీగా ఆశలు పెట్టుకున్న అసంతృప్త నేతలు * ప్రస్తుతం ఖాళీగా ఉన్న 64 కార్పొరేషన్ పదవులు
తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధమైంది. దీంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రమహిళా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. మరో 50 నామినేటెడ్ పదవుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నట్లు గులాబీ పార్టీలో చర్చ సాగుతోంది. దాంతో పదవులపై సీనియర్ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ చైర్‌పర్సన్‌గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డిని నియమించింది. కమిషన్‌లో మరో ఆరుగురు సభ్యులకు చోటు కల్పించింది. కమిషన్ పదవీకాలాన్ని ఐదేళ్ల పాటు ఉండేలా నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా రాష్ట్రంలోని నామినేటేడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. కొన్నాళ్ల క్రితం పార్టీలో చేరిన మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. దీంతో పెండింగ్‌లో ఉన్న 64 నామినేటెడ్ పదవుల కోసం పలువురు నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
దుబ్బాక ఉపఎన్నిక ఓటమితో పాటు జీహెచ్ఎంసీలో ఎదురుదెబ్బ తగలడంతో పార్టీ ప్రక్షళన దిశగా గులాబీ పార్టీ అడుగులు వేస్తోంది. ఓ వైపు గ్రాడ్యుయేట్ ఎన్నికలు సమీపిస్తుండడం.. మరోపక్క నాగార్జున సాగర్ ఉపఎన్నిక, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తుండడంతో గులాబీ బాస్ కీలక నిర్ణయం తీసుకుంటారని కారు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గులాబీ పార్టీ మరిన్ని ఇబ్బందుల్లో పడకముందే అసంతృప్త నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెడతారనే ప్రచారం కూడా జోరందుకుంది.
ప్రధానంగా కార్పొరేషన్ చైర్మన్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, డైరెక్టర్‌లతోపాటు ఇతర నియమిత పదవుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా.. 64 కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. దాంతో.. పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు ఆశపడుతున్నారు. అటు.. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలకు కూడా ఈ పదవుల్లో స్థానం కల్పించనున్నట్లు సమాచారం. గతంలో ఎమ్మెల్యేలకు కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టారు. కానీ ఇప్పుడు ఒక్కరికి ఒక్క పదవేనిని మొదట్లో అన్నా తరువాత ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ విధానాన్ని తీసుకొచ్చారు. దాంతో.. చాలా మంది నేతలకు ఈసారి జోడు పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో.. మిగిలిన నామినేటెడ్ పదవులు కూడా త్వరలోనే భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం 64 నామినేటెడ్ పదవుల్లో 50 వరకు పదవులను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి నామినేటెడ్ పదవుల భర్తీ మొదలు కావడంతో సీనియర్ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మరి గులాబీ బాస్ ఎవరెవరికి పదవులు కట్టబెడతారో వేచిచూడాల్సిందే.!