సొంత గూటికి డి. శ్రీనివాస్.. సోనియా సమక్షంలో..

D Srinivas: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డీఎస్ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారయ్యింది.

Update: 2022-01-16 14:36 GMT

సొంత గూటికి డి. శ్రీనివాస్.. సోనియా సమక్షంలో..

D Srinivas: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డీఎస్ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల 24న సోనియాగాంధీ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన డీఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. గత కొన్నాళ్లుగా టీఆర్ఎస్ హైకమాండ్ తో అంటిముట్టనట్లుగా ఉంటున్న డీఎస్ కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదించి మాతృసంస్థలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

సుదీర్ఘ అనుభవం ఉన్న డీఎస్ రెండు సార్లు పీసీసీ చీఫ్ గా పని చేసి కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తీసుకువచ్చారని పేరు సంపాదించుకున్నారు. పలుమార్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రిపదవులు చేపట్టారు. ఒకానొకదశలో ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. కాంగ్రెస్ లో పునరాగమనం తర్వాత ఆయన ఏ బాధ్యతలు నిర్వహిస్తారనేది కీలకం కానుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న డీఎస్ పదవి కాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. డీఎస్ తనయుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.

నిజామాబాద్ మేయర్ గా పని చేసిన మరో కుమారుడు ధర్మపురి సంజయ్ కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారు. సీనియర్ నేత డీఎస్ టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరనుండటం అన్ని పార్టీలోనూ హాట్ టాపిక్ అవుతోంది. బీసీ నేతగా మంచి పట్టున్న డీఎస్ ఇటు టీఆర్ఎస్ ను వీడటం అటు కాంగ్రెస్ లో చేరడంపై రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News