Malla Reddy: మంత్రి మల్లారెడ్డిపై సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు

Malla Reddy: మంత్రి తీరుపై ఎమ్మెల్యేల ఆగ్రహం

Update: 2022-12-20 00:52 GMT

Malla Reddy: మంత్రి మల్లారెడ్డిపై సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు

Malla Reddy: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బిఆర్ఎస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి మల్లారెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు జెండా ఎగరేశారు. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా జిల్లా ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసమ్మతి గళం విప్పారు. పెద్ద పదవులన్ని మంత్రి తీసుకువెళ్లడంతో తమ సొంత నియోజకవర్గాల్లోని నేతలకు న్యాయం చేయలేకపోతున్నామని ఫైర్ అయ్యారు.

నామినేటెడ్ పదవులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బిఆర్ఎస్ లో ముసలం పుట్టించాయి. మంత్రి మల్లారెడ్డిపై ఆ జిల్లా ఎమ్మెల్యేలను తిరుగబడేలా చేస్తున్నాయి. ఆ జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సోమవారం మల్లారెడ్డికి వ్యతిరేకంగా భేటీ అయ్యారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు ఇంట్లో సమావేశమై నాలుగు గంటలకుపైగా చర్చించారు. భేటీ లో ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు సుభాశ్‌రెడ్డి, వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ పాల్గొన్నారు. పదవుల విషయంలో మంత్రి మల్లారెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐతే గత కొన్నాళ్లుగా మంత్రి మల్లారెడ్డికి జిల్లా ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. తాజాగా మేడ్చల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా తన నియోజక వర్గం నేతకు మల్లారెడ్డి అవకాశం ఇవ్వడంతో వివాదం రాజుకొంది. దాంతో జిల్లా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. మంత్రి వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అందరినీ కలుపుకొని పోవడం లేదని, పదవులన్నింటినీ మేడ్చల్‌ నియోజక వర్గానికే తీసుకెళ్తున్నారని ఆరోపించారు. తమ తమ నియోజకవర్గాలకు ఎలాంటి పదవులు దక్కడం లేదని.. కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వైఖరిపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలు డిసైడ్ అయ్యారు..

అయితే ఎమ్మెల్యేల అసమ్మతి మీటింగ్ వెనుక అసలు రీజన్ వేరే ఉంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మల్లారెడ్డి మోనార్క్ అన్నట్లు వ్యవహారం చేయడం జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో అధిష్టానం తనకు నాలుగు టికెట్లు ఇస్తుందని ప్రచారం చేసుకుంటున్నారని టాక్. ఇది కూడా జిల్లా ఎమ్మెల్యేల ఆగ్రహానికి కారణం అంటున్నారు. అదలా ఉంటే మల్కాజిగిరి ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో తన కొడుకును సైతం బరిలోకి దింపే యోచనలో ఉన్నారట. తను పార్లమెంట్ కు పోటీ చేసి కొడుకుని అసెంబ్లీకి పంపాలని భావిస్తున్నట్లు టాక్. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే జిల్లాలోని ఎమ్మెల్యేల సపోర్ట్ కు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే వాదనలు ఉన్నాయి.

మొత్తానికి మేడ్చల్ నియోజకవర్గం నుండి నేను పోటీ చేసేది లేదంటూ గతం నుంచి మంత్రి మల్లారెడ్డి చెప్తూ ఉండడంతో ఈ సీటుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు మైనంపల్లి. ఇందులో భాగంగా ముందుగానే నియోజకవర్గ సీటును తన అనుచరుడు నక్క ప్రభాకర్‌కు వచ్చేలా స్కెచ్ వేస్తున్నారు అనే ప్రచారం గులాబీ శ్రేణుల్లో సాగుతోంది. ఇటీవలే ఐటీ దాడులు ఎదుర్కున్న మల్లారెడ్డికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇదే అంశంపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్తే పరిస్థితి ఏంటని ఆయన ఆలోచనలో పడ్డట్లు సమాచారం.

Tags:    

Similar News