TRS MLA Tests Positive : తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. వరుసగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు సైతం కరోనా బారినపడ్డారు. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో రెండు రోజుల కింద ఆయన పరీక్షలు చేయించుకున్నారు. బుధవారం రిపోర్టులు వచ్చాయి. అందులో కరోనా పాజిటివ్ రావడంతో మిర్యాలగూడలోని తమ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 39,342కి చేరింది. ఇందులో 12,958 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు వైరస్ నుంచి 25,999 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 386కి చేరింది.
కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా కరోనా బారినపడ్డారు. ఇక కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఐతే వీరిలో చాలా మంది ఇప్పటికే కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.