TRS MLA Tests Positive : తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. వరుసగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వైరస్ బారిన పడ్డారు. ఈ విషయం మంగళవారం రాత్రి వెల్లడైంది. దీంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హోం ఐసోలేషన్‌లో ఉండిపోయారు. ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వారి ఫలితాలు రావాల్సి ఉంది. అయితే, హోం ఐసోలేషన్‌లో ఉన్న జీవన్ రెడ్డికి వైద్యాధికారుల పర్యవేక్షణలో కరోనా చికిత్స జరుగుతోంది.
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 57,142కి చేరింది. ఇందులో 13,753 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు వైరస్ నుంచి 42,909 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 480కి చేరింది.