Kollapur: కొల్లాపూర్‌లో హై టెన్షన్.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్
Kollapur: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది.
Kollapur: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చకు వెళ్తుండగా ఎమ్మెల్యేను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే బీరం వర్గీయులు ఆందోళనకు దిగారు. అభివృద్ధిపై వీరిద్దరి సవాళ్లతో కొల్లాపూర్‌లో కొద్దిరోజులుగా రాజకీయం హీటెక్కింది. తమ బహిరంగ చర్చకు ఇవాళ అనుమతివ్వాలంటూ ఇరువర్గాల నుంచి దరఖాస్తులు వెళ్లినా.. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు తిరస్కరించారు. అయినప్పటికీ సై అంటే సై అంటూ జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి పట్టుదలతో ఉండటంతో ఏం జరుగుతుందోనని ప్రజల్లో ఉత్కంఠ పెరిగింది. మరోవైపు కొల్లాపూర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. ఇరువర్గాలను హౌస్ అరెస్ట్ చేసి, నేతల ఇళ్లకు వెళ్లే మార్గాల్లో ఎవరినీ అనుమతించడం లేదు.
ఇటీవల జూపల్లి కృష్ణారావు విసిరిన సవాలు స్వీకరిస్తున్నానని, కొల్లాపూర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు కాకుండా ఆయన ఇంటికే వెళ్లి చర్చిస్తానన్నారు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి గతంలో చాలాసార్లు మాజీ మంత్రి సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారని తెలిపారు. రాజకీయ వేధింపులు, అక్రమ దందాలపై వెల్లడిస్తానని చెప్పారు. జూపల్లి టీఆర్ఎస్‌లోనే ఉంటూ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి తనపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తనపై నిరాధారణ ఆరోపణలు చేశారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు వెల్లడించారు. తనను ఎదుర్కొలేనని తెలిసే బీరం హర్షవర్ధన్ డ్రామాలు చేస్తున్నారన్నారు. తప్పు చేసినోడు తలవంచుకొని పోతాడు.. తాను తప్పు చేయలేదని మచ్చలేని తన రాజకీయ జీవితంపై బీరం ఆరోపణలు చేశారని విమర్శించారు. కొల్లాపూర్ అంబేడ్కర్ చౌరస్తాకు రమ్మని తాను సవాల్ చేశానని సవాల్‌ను స్వీకరించకుండా ఇంటికే వస్తానన్నారని తెలిపారు జూపల్లి. తన ఇంటికే వస్తానన్న హర్షవర్ధన్‌రెడ్డి ఇప్పటి వరకు రాలేదని అయితే తమ ఇద్దరి మధ్య తగాదాతో పార్టీకి సంబంధం లేదన్నారు.