ఆమె పదవిని రెన్యువల్ చేస్తారా.. ఆయనకు ఎమ్మెల్సీతో సరిపెడతారా?

Update: 2020-11-17 10:09 GMT

ఆ జిల్లాలో మరోసారి ఎమ్మెల్సీ పదవి అంశం, హాట్‌టాపిక్‌గా మారింది. ఆ పోస్టు, అధికార పార్టీలో చిచ్చు రేపుతోంది. కొద్ది రోజుల క్రితం స్ధానిక సంస్ధల ఎన్నికలు ముగిసి సీఎం కూతురు కవిత భారీ మెజార్టీతో గెలుపొందగా, మరో ఎమ్మెల్సీ పదవి ఆశావాహులను ఊరిస్తోందట. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సదరు మహిళా నేతకు మరోసారి ఆ పదవి రెన్యువల్ చేస్తారా...? కొత్త నేతకు అవకాశం కల్పిస్తారా...? ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ కావడంతో జిల్లాకు చెందిన వారికే అవకాశం ఇస్తారా..? మరో జిల్లాకు చెందిన వారిని, ఈ పదవి వరిస్తుందా..? వంటి ఉహాగానాలు అధికార పార్టీలో, రచ్చ రాజేస్తున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో, మరో ఎమ్మెల్సీ పోరు టీఆర్ఎస్‌ నేతల్లో ఆశలు పెంచుతోంది. ఇందుకోసం బడాబడా నేతలు చక్రం తిప్పుతున్నారు. అదే కోల్డ్‌వార్‌కు నిప్పు రాజేస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆకుల లలిత పదవీ కాలం, మరో ఆరు నెలల్లో ముగుస్తోంది. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆకుల లలితకు పదవీ గండం పొంచి ఉందట. ఆమె పదవికి ఎసరు పెట్టేందుకు కొందరు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారట. మరో ఆరు నెలల్లో పదవీ కాలం ముగియనుండటంతో ఇప్పటి నుంచే ఆ పదవిపై కన్నేసిన కొందరు నేతలు ఆమెకు చెక్ పెట్టేందుకు చాప కింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టేశారట. మరో ఐదు నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టనుండటంతో ఆ ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది.

ఎమ్మెల్సీ ఆకుల లలిత కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగిన ఆమె, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఆర్మూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికలు ముగిసిన పక్షం రోజుల్లోనే, ఆమె పార్టీ మారడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగిన లలిత, ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవడంపై రాష్ట్రస్థాయిలో చర్చ జరిగింది. త్వరలో ఆకుల లలిత పదవీకాలం ముగుస్తుండటంతో, ఈ పదవి ఆమెకు దక్కకుండా కొందరు నేతలు పావులు కదుపుతున్నారట. అధినేత సైతం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవిని తన మిత్రుడు మాజీ మంత్రి మండవకు కట్టబెట్టే యోచనలో ఉన్నారట. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మండవకు అవకాశం కల్పించే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే ఆకుల లలితకు ఎమ్మెల్సీ పదవి, మరో టర్మ్‌ కొనసాగిస్తారనే పక్కా హామీతోనే లలిత టీఆర్‌ఎస్‌లో చేరినట్లు గతంలో ప్రచారం జరిగింది. ఐతే సీఎం కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పిస్తారనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఆమెకు మరో టర్మ్ పదవి దక్కకుండా, జిల్లాకు చెందిన ఒకరిద్దరు నేతలు అనేక ఆరోపణలు చేశారట. అందులో భూకబ్జా ఆరోపణలూ వున్నాయి. ఆ ఆరోపణలు అధికార పార్టీలో తీవ్ర కలకలం సృష్టించాయి. ఆమె సైతం ఎమ్మెల్సీ పదవి కంటే, వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారట. మూడు నియోజకవర్గాల్లో తన వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో, ఎమ్మెల్సీ పదవి కంటే ఎమ్మెల్సే టికెట్ పొందేందుకే ఆమె ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. ఐతే అధినేత ఆలోచన ఎలా ఉంటుందో, ఆకుల లలిత భవిష్యత్‌పై ఎలాంటి భరోసా ఇస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Full View


Tags:    

Similar News