దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో టీఆర్ఎస్ లో కంగారు మొదలైందా..? నగార్జున సాగర్ ఉపఎన్నికపై గత ఫలితాల ప్రభావం పడకుండా ఎలాంటి వ్యూహం పన్నుతోంది..? సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల మృతితో ఖాళీ అయిన ఆ సీటును వారి కుటుంబ సభ్యులకే ఇస్తారా..? లేక అభ్యర్థిని మారుస్తారా..? సాగర్ సమరంలో గులాబీ పార్టీ వ్యూహమేంటి..?
తెలంగాణలో వరుస ఎన్నికలతో అధికార పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అతున్నారు. దానికితోడు ఆశించిన ఫలితాలు రాకపోవడం గులాబీ పార్టీ నేతలను కంగారెత్తిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో త్వరలో జరగబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు టీఆర్ఎస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దానికితోడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే మృతితో మరో ఉపఎన్నికను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దుబ్బాకలో రామలింగారెడ్డి భార్యను బరిలోకి దింపినా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేక పోయిన టిఆర్ఎస్ లో గెలుపు గుర్రాన్ని అన్వేషించే పనిని మొదలుపెట్టింది.
ఇప్పటివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యుతకే టిక్కెట్ కేటాయించే సంప్రదాయం వస్తోంది. అయితే దుబ్బాకలో ఎదురైన చేదు అనుభం టీఆర్ఎస్ ను పునరాలోచనలో పడేసింది. అటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సిట్టింగ్ కార్పొరేటర్లను మార్చిన చోట విజయం సాధించిన టిఆర్ఎస్ మార్చని చోట ఘోరంగా ఓడింది. వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు నర్సింహయ్య కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాల అనే విషయంలో తర్జన భర్జన పడుతోంది. అటు నోముల కుటుంబ సభ్యులు కూడా తమలో ఒకరికిటికెట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు దుబ్బాకలో ఫ్యామిలీ సెంటమెంట్ వర్కౌట్ కాకపోవటంతో సాగర్‌లో మరోసారి ఆ సాహసం చేస్తారా అన్న ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి. అటు నోముల కుంటుంబానికి టికెట్ కేటాయించకపోతే ఎవరికి అవకాశం ఉంటుందన్న చర్చ జోరందుకుంది. సాగర్ నియోజకవర్గంలో కోటిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతనికే మంత్రి జగదీష్ కూడా మద్ధతు ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అటు యాదవ సామాజిక వర్గం బలంగా ఉండే ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుండేబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు మన్నెం రంజిత్ యాదవ్ బరిలో నిలిచే యోచనలో ఉన్నారు. మంత్రి కేటిఆర్‌కు సన్నిహితంగా వుండే ఎన్ఆర్ఐ గడ్డంపల్లి రవిందర్ రెడ్డి కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
సాగర్ ఉపఎన్నికల్లో కచ్చితంగా గెలిచి సత్తా చాటాలని కారు పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని పార్టీలోకి తెచ్చి ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలుపు ఖాయమనే చర్చ కూడా గులాబీ నేతల్లో ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యమత్రి కేసీఆర్ ఆ నేతతో ఒక దఫా చర్చలు కూడా జరిపారని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. అయితే జానారెడ్డి మాత్రం ఆ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. ఒకవేళ జానారెడ్డి టీఆర్ఎస్ లో చేరకుంటే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని పోటీకి దించితే ఎలాంవుంటుందన్న దానిపైనా గులాబీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి సాగర్ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అక్కడి అభివృద్ది పై టిఆర్ఎస్ ఫోకస్ చేసింది. అభ్యర్థి ఎవరైనా తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునే వ్యూహాలను ఇప్పటికే అమలులో పెట్టింది. అధికార పార్టీ వ్యూహం ఎలా ఉన్నా అభ్యర్థి కూడా కీలకం కనుంది. అయితే క్యాండిట్ ని ముందే ఫైనల్ చేస్తారా లేక దుబ్బాకలో మాదిరిగా చివరి వరకు నాన్చుతారా అన్నది వేచి చూడాలి.