Nagarjuna Sagar: టీఆర్ఎస్ తొలిదశ ప్రచారం పూర్తి
Nagarjuna Sagar: మండలాలను చుట్టేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి * ప్రచారానికి సిద్ధమవుతున్న బీజేపీ ముఖ్య నేతలు
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వాతావరణం ఇక వేడెక్కనుంది. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి సారించాయి. నలభై ఏళ్లుగా ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్న జానారెడ్డి ఒకవైపు.. నలభై ఏళ్లు కూడా నిండని టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు మరోవైపు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎన్నిక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధానంగా దుబ్బాక ఫలితం పునరావృతం కాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్.. ఇన్‌ఛార్జులను నియమించి ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండు నెలల నుంచే మండలాలవారీగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. తన హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతున్నారు. గతంలో తనకు అండగా ఉండి, ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్నవారు తిరిగి పార్టీలో చేరేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇక జానారెడ్డి కుమారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇక బీజేపీ ముఖ్య నేతలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.