తెలంగాణలో ప్రశాంతం.. ఏపీలో ఉద్రిక్తంగా పోలింగ్
*హైదరాబాద్ లో ఓట్ల గల్లంతుపై మాధవీలత ఫిర్యాదు
ఓటర్లు తీర్పిచ్చేశారు. ఈసీ అధికారులు ఆ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇక జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడేదాకా ఊహాగానాలు ఉండనే ఉంటాయి. ఆ విషయం పక్కన పెడితే.. తెలంగాణలో పూర్తి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగ్గా.. ఏపీలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలింగ్ జరిగింది. మరోవైపు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై ఈసీ అధికారులు కేసు నమోదు చేశారు.
దేశవ్యాప్తంగా జరిగిన నాలుగో దఫా ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. తెలంగాణలో ప్రశాంతంగా జరగ్గా.. ఏపీలో మాత్రం పలు చోట్ల దాడులు, ఘర్షణలు, అభ్యర్థుల కాన్వాయ్ లపై దాడులు చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కొన్నిచోట్ల టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య దాడుల్లో రక్తాలు కారాయి. అయితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా పోలింగ్ కు మాత్రం ఎక్కడా ఆటంకం జరగలేదు.
ఫస్ట్ అవర్స్ లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో హైదరాబాద్ లోని పలు బూత్ లలో దాదాపు గంటకు పైగా పోలింగ్ కు ఆలస్యమైందని హైదారాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఈసీకి ఫిర్యాదు చేశారు. అలాగే ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఇటీవల హైదరాబాద్ ఓటర్ జాబితాను ప్రక్షాళన చేశామన్నారని.. 5లక్షలకు పైగా ఓట్లు తొలగించినట్లు చెప్పారని.. కానీ జాబితా ప్రక్షాళన కాలేదని.. బతికున్న ఓటర్లను చనిపోయినట్టుగా చూపించారని.. ఓటేయడానికి వస్తే వేయనివ్వకుండా బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. జాంబాగ్ లో ఉన్న దేవేందర్ ప్రజాపతి అనే వ్యక్తి చనిపోయినట్టుగా పేర్కొన్నారని.. ఆయనతో పాటు ఆయన కుటుంబంలోని ఆరుగురు ఓట్లను ఎన్నికల అధికారులు గల్లంతు చేశారని మాధవీలత ఆరోపించారు.
అలాగే నార్ల మల్లేశ్ అనే మరో ఓటరు పేరుతో కూడిన జాబితాను తనకు ఇచ్చారని.. కానీ అతను చనిపోయినట్టుగా పేర్కొన్న మరో లిస్టును జీహెచ్ఎంసీ లోని బీఎల్ఓ లకు పంపారని మాధవీలత ఆరోపించారు. మల్లేశ్ యాదవ్ ఓటేయడానికి వస్తే ఆయన్ని జైలుకు పంపిస్తామని బెదిరించారని.. దీనికి వికాస్ రాజ్ ఏం సమాధానం చెబుతారని మాధవీలత ప్రశ్నించారు.
ఉదయం నుంచీ హైదరాబాద్ బూత్ లలో పర్యటిస్తున్న మాధవీలత.. పలు అవకతవకలకు ఈసీనే కారణం అంటూ ఆరోపించారు. మరోవైపు అభ్యర్థిగా ఉన్న మాధవీలత ఓటర్లను చెక్ చేసే క్రమంలో బుర్ఖాలు తొలగించారని.. ఆ పని అభ్యర్థులు చేయరాదని ఈసీ వికాస్ రాజ్ అన్నారు. తమకు అందిన ఒకటి, రెండు ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని కేసు పెట్టామని.. లా అండ్ ఆర్డర్ చేయి దాటకుండా ముందుగా కేసులు పెట్టామని.. ఆ తరువాత విచారిస్తామని చెప్పారు. హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ, ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. ప్రతి ఎన్నిక కూడా ఓ చాలెంజ్ లాంటిదేనని, అవతలివైపు ఎవరున్నా.. గెలుపు కోసం పోరాడాల్సిందేనని వ్యాఖ్యానించారు.
మావోయిస్టు ప్రభావిత, సమస్యాత్మక ప్రాంతాల్లో మినహా.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు.. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల్, మంథని అసెంబ్లీ నియోజకవర్గాలు.. వరంగల్ పార్లమెంటు పరిధిలోని భూపాలపల్లి.. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గాల్లో.. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేట ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగిసింది. అవి కాకుండా మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల దాకా కొనసాగింది.
అటు ఏపీలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న అరకు, పాడేరు, రంపచోడవరం ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అలాగే సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పాలకొండ, కురుపాం, సాలూరు ప్రాంతాల్లో పోలింగ్ 5 గంటలకే ముగిసింది. మిగిలిన మిగిలిన 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ కొనసాగింది. పోలింగ్ ముగిసిన వెంటనే సిబ్బంది ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. మొత్తానికి ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఎవరి భవితవ్యమేంటో జూన్ 4న తేలిపోతుంది.