మెడికల్ సీట్ల దందాపై ముదిరిన పంచాయతీ
Telangana: మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ పల్లాపై రేవంత్ ఆరోపణలు
Telangana: తెలంగాణలో మెడికల్ సీట్ల దందాపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ దందా వెనుక అధికార పార్టీ నేతలైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. రేవంత్ ఆధ్వర్యంలో ఓ టీమ్ ఇప్పటికే గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదులు కూడా చేసింది. సీట్లు బ్లాక్ చేసి అడ్డగోలుగా అమ్ముకుంటున్నారని, ఈ గోల్ మాల్ లో అర్హులైన పేద, మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం జరుగుతోందనేది రేవంత్ ఆరోపణ.
మరోవైపు మెడికల్ సీట్ల కుంభకోణంపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ కోరడం హాట్ టాపిగ్గా మారింది. అటు కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గవర్నర్ కి లేఖ రాయడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు తారస్థాయికి చేరాయి. ఇక అవకతవకలు నిరూపిస్తే తన కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిస్తానని మంత్రి పువ్వాడ కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలో 20 ఏండ్లుగా నడుస్తున్న మమత మెడికల్ కాలేజీలో పీజీ అడ్మిషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు.
అయితే రేవంత్ మాత్రం కాలేజీలో ఉన్న సీట్లెన్ని.. విద్యార్థులకు కేటాయించినవి ఎన్ని.. టీచింగ్ స్టాఫ్, నాన్-టీచింగ్ స్టాఫ్ వంటి వివరాలు వెల్లడించాలని సవాల్ విసిరారు. పువ్వాడతో పాటు పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజీల్లో ఏకకాలంలో సోదాలు జరిగితే బండారం బయట పడుతుందంటున్నారు. ఇక రేవంత్ ఆరోపణల మీద ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు తనకు మెడికల్ కాలేజీనే లేదని, కాలేజీ లేకుండా సీట్ల దందా ఎలా చేసుకుంటానో రేవంత్ చెప్పాలంటూ తీవ్ర స్థాయిలో మాటలదాడి చేశారు.
మెడికల్ సీట్ల అక్రమ దందా గుట్టు బయట పడాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత తనిఖీలు చేయించుకొని స్వచ్ఛత నిరూపించుకోవాలని టీ-పీసీసీ చీఫ్ సవాల్ విసురుతున్నారు. అటు గవర్నర్ కూడా నేరుగా రంగంలోకి దిగి నివేదికలు కోరడంతో.. విషయం కాస్తా కేంద్రం పరిధిలోని మెడికల్ కౌన్సిల్ కు చేరినట్లయింది. మరి... ఎంసీఐ అధికారులు ఎప్పుడు వస్తారు.. తనిఖీలు ఎప్పుడు నిర్వహిస్తారు.. ఎలాంటి గుట్టూ-మట్లు బయట పెడతారన్నది చర్చనీయాంశంగా మారింది.