నేడు సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం
* రంగారెడ్డి జిల్లా అల్వాల పంచాయతీలో మ్యారేజ్.. ఏర్పాట్లు పూర్తి * నా బాగోగులు సీఎం కేసీఆరే చూశారు * నన్ను కూతురుగా స్వీకరించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు: ప్రత్యూష
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ఓ ఇంటి వెలుగు కాబోతుంది. తన నవ్వుల పూదోటను మరొకరికి పంచనుంది. ఒక హృదయానికి మరో కొత్త మనసు పరిచయం కాబోతుంది. జీవితాంతం గుర్తుండే ఓ స్మృతికి ఇవాళే అంకురార్పణం జరగనుంది. సీఎం కేసీఆర్ ఔదార్యంతో చక్కని జీవితాన్ని పొందిన ప్రత్యూష.... ఏడడుగులు వేయబోతుంది.
సీఎం కేసీఆర్ ఔదార్యంతో పునర్జీవవితాన్ని పొందిన ప్రత్యూష ఇప్పుడు నవవధువై నిండు జీవితాన్ని పొందడానికి పెళ్లిపీటలు ఎక్కనుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల పంచాయతీలోని పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో ఇవాళ ఉదయం 10 గంటలకు వివాహం జరగనుంది. పెళ్లి ఏర్పాట్లను ఇప్పటికే స్ర్తీ శిశు సంక్షేమ శాఖ పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన ఉడుముల జైన్‌మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరగనుంది. వీరి నిశ్చితార్థం అక్టోబరులో విద్యానగర్‌లోని ఓ హోటల్ జరిగింది. ప్రత్యూష కుటుంబంతో తమకు చుట్టరికం కూడా ఉందని చరణ్‌రెడ్డి బంధువులు తెలిపారు. చరణ్‌రెడ్డి అమ్మమ్మ గ్రామం పాటిగడ్డ కావడంతో ఇక్కడ వివాహం చేస్తున్నారు. నిన్న బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో ప్రధానం నిర్వహించారు.
మరోవైపు.. ప్రత్యూషను సాక్షాత్తూ ముఖ్యమంత్రి సతీమణి శోభమ్మ తన చేతులమీదుగా పెళ్లికూతురును చేశారు. మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేగంపేటలోని ఐఏఎస్ అతిథిగృహంలో ప్రత్యూషను పెళ్లికూతురుని చేశారు. మంగళవాయిధ్యాల మధ్య కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుక అనంతరం శోభమ్మ.. ప్రత్యూషకు డైమండ్ నక్లెస్, పట్టువస్త్రాలు పెట్టి ఆశీర్వాదించారు. తనను ఆశీర్వదించడానికి సీఎం సతీమణి రావడంతో ప్రత్యుష ఆనందం వ్యక్తం చేసింది.
ఇక.. పెళ్లికూతురు ప్రత్యూష తనను కూతురుగా స్వీకరించిన కేసీఆర్‌కు ధన్యవాదలు తెలిపింది. ఐదేళ్ల క్రితం కేసీఆర్ స్వయంగా వచ్చి తన కూతురుగా స్వీకరించారని.. అప్పటి నుంచి తన బాగోగులు ఆయనే చూశారని చెప్పింది. పెళ్లి సంబంధం కూడా వాళ్లే చూసి చేస్తున్నారని తెలిపింది.
మూడున్నర సంవత్సరాల్లో చదువు పూర్తి చేసి... వన్ ఇయర్ జాబ్ కూడా చేశానని ప్రత్యుష తెలిపింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చెప్పింది. వచ్చే నెల 20న నిమ్స్‌లో జాయిన్ అవ్వబోతున్నానంది. అందరూ అనుకుంటున్ననట్లు తనది లవ్ మ్యారేజ్ కాదని... పెద్దలు కుదిర్చిన పెళ్లేనని ప్రత్యుష స్పష్టం చేసింది.
ఎట్టకేలకు.. సీఎం కేసీఆర్ ఔదార్యంతో చక్కని జీవితాన్ని పొందిన ప్రత్యూష ఇప్పుడు పెళ్లి చేసుకుంటోంది. ఇటు.. వివాహంతో పాటు.. వచ్చే నెలలోనే ఉద్యోగంలో కూడా చేరబోతోంది. దీంతో ప్రత్యూష సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.