మూడు రోజుల్లో ముగ్గురు మహిళల అదృష్యం..ఎక్కడో తెలుసా ?

Update: 2020-09-22 11:05 GMT

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం కొద్ది రోజులుగా వరుసగా అమ్మాయిల అదృశ్యం అవుతున్న సంఘటనలతో ఉలిక్కిపడుతుంది. ముఖ్యంగా నగరంలోని దుండిగల్ పీఎస్ పరిధిలో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. దుండిగల్ ప్రాంతంలో వేరు వేరు ఘటనల్లో ముగ్గురు మహిళలు అదృష్యం అవ్వడంతో ఈ కేసులు ఆ ప్రాంత పోలీసులు సవాల్‌గా మారాయి. ఇక ఈ సంఘటలకు సంబందించి పోలీసులు తెలిపిన పూర్తివివరాల్లోకెళితే దుండిగల్ పోలీస్టేషన్ పరిధిలో ముగ్గురు మహిళలు అదృశ్యం అయినట్లు కేసులు నమోదయ్యాయని దుండిగల్ సీఐ వెంకటేషం తెలిపారు. వారి వివరాల్లోకెళితే దుండిగల్‌ లో నివాసం ఉంటున్న శిరీష్ అనే 22 ఏళ్ల యువతి,భారతి అనే 21 యువతి, ఎమ్.పద్మావతి అనే 38 ఏళ్ల మహిళ అదృష్యమయ్యారని తెలిపారు.

శిరీష్ అనే 22 ఏళ్ల యువతి ఈనెల 19వ తేదీన ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి బయటికి వెళ్లిందని తెలిపారు. ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబీకులు వెతకడం ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోయే సరికి చుట్టుపక్కల వారిని, బంధువులను తమ కూతురి గురించి ఆరా తీసారు అయినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి నరసమ్మ దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కూతురు ఎక్కడ ఉన్నా ఆచూకీ తెలుసుకోవాలని ప్రాధేయపడింది.

ఇదిలా ఉంటే అదే ప్రాంతానికి చెందిన భారతి అనే 21 ఏళ్ల మరో యువతి కూడా అదృష్యం అయ్యిందని తెలిపారు. సురారం రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న భారతి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం నిమిత్తం వెల్తున్నానని చెప్పిన భారతి ఈనెల 20వ తేదీ ఉదయం కొంపల్లిలోని ఇంట్లో నుండి బయల్దేరింది. ప్రతి రోజు ఇంటికి రావలసిన సమయానికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు తెలిసిన వారిని ఆరా తీసారు. అయినా ఆచూకీ తెలియక పోవడంతో ఆమె తండ్రి పైడితల్లి దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.

ఇక ఇదే తరహాలో మరో సంఘటన కూడా చోటు చేసుకుంది. ఎమ్.పద్మావతి అనే 38 ఏళ్ల గృహిణి కూడా అదృశ్యం అయ్యింది. బహుదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీలో తన భర్తతో నివాసం ఉంటున్నారు. అయితే ఈనెల 20న భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడడంతో 21వ తేదీ ఉదయం భార్య పద్మావతి ఇంట్లోనుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో భర్త లక్ష్మారెడ్డి దుండిగల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసాడు. దీంతో పోలీసులు ఈ మూడు చేసులను ముగ్గురు మహిళలు మిస్సింగ్ కేసులుగా నమోదు చేసుకున్నారు. అసలు వారు ఎక్కడికి వెళ్లారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇంకా ఇలాంటి మిస్సింగ్ కేసులు ఎన్ని నమోదవుతాయో వేచి చూడాల్సిందే.

ఇక గత ఏడాది కూడా హైదరాబాద్ నగరంలో ఇదే విధంగా మహిళల మిస్సింగ్ కేసులు ఎన్నో నమోదు అయ్యాయి. గత ఏడాది రాష్ట్రంలో సగటున రోజుకు 60 మంది వరకు అదృశ్యమయ్యారని తెలుస్తోంది. గతేడాది జూన్ నెల మొదటి పది రోజుల్లోనే 545 మంది కనిపించకుండా పోయారు. పోలీస్ రికార్డుల్లో ఇవి నమోదయిన కేసులు. ఇంకా నమోదు కానీ కేసులు కూడా కొన్ని ఉన్నట్టు సమాచారం. అదృష్యం అయిన వారిలో సగం మందికి పైగా రాజధాని పరిసరాలకు చెందిన వారే కావడం గమనార్హం. గతేడాది అదృశ్యమయి వారిలో రెండేళ్ల పసిపిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ ఉన్నారు.

Tags:    

Similar News