Nirmal District: నిర్మల్ జిల్లాలో కరోనా రహిత పల్లెలు
Nirmal District: పెంటదరి, ఇప్పచెల్మ, లక్ష్మీనగర్‌కు ఎంటరవ్వని కరోనా
Nirmal District: ప్రపంచ దేశాలను కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కానీ ఆ మూడు గ్రామాలను టచ్ చేయలేకపోయింది. కనీసం పొలిమేర కూడా దాటలేకపోయింది. ఆ పల్లెల్లో అప్పుడు, ఇప్పుడు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. వారి ఆచారాలు, ఆహారపు అలావాట్లే వాళ్లకు వరంగా మారాయి. ఇంతకీ కరోనా రహిత గ్రామాలు ఎక్కడ ఉన్నాయి. ఆ గ్రామస్తులు పాటిస్తున్న నియమాలేంటి.?
విసిరేసినట్టుంటే గూడేలు. దూరదూరంగా ఉండే జనాలు.. చేతులు కలపని ఆచారం. ఇవే ఆ గ్రామాలను కరోనా రహిత పల్లెలుగా మార్చాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని గిరిజన గ్రామాలైన పెంటదరి ,ఇప్పచెల్మ ,లక్ష్మీనగర్‌లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మహారాష్ట్రకు ఆనుకొని ఉన్నప్పటికీ ఈ పల్లెలను కరోనా వైరస్ టచ్ చేయలేకపోయింది. కరోనా గత్తర దరిచేరకుండా గిరిజనులు తీసుకున్న జాగ్రత్తలే వారికి శ్రీరామరక్షగా మారాయి.
గ్రామపెద్ద పటేల్ నిర్ణయమే ఈ గ్రామస్తులకు వేదవాక్కు. కరోనా కట్టడి కోసం ఆ పటేల్ కొన్ని ఆంక్షాలు విధించారు. బయటి వారు ఎవ్వరూ గ్రామాల్లోకి రాకూడదు. ఇక్కడి వారు బయటకు వెళ్లి వస్తే ఖచ్చితంగా వేడి నీళ్లల్లో పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఈ ఆదేశాలను గ్రామస్తులు తూచా తప్పకుండా పాటించడంతో గ్రామంలోకి వైరస్ ఎంటర్ అవ్వలేదు.
మరోవైపు గిరిజనులు తీసుకునే అహారపు అలవాట్లు కూడా ఆరోగ్యాన్ని ప్రసాధిస్తున్నాయి. మూడు పూటల అంబలి సేవిస్తారు. తమ పొలాల్లో పండించిన ధాన్యాలను, అడవిలో దొరికే పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. అలాగే ఔషధ మూలికలను ప్రతీ మూడు గంటలకు ఒకసారి సేవించడం అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పచెలమలో నివాసముంటున్న దొంతన్న ఇచ్చే ద్రావణాన్ని సంజీవనిగా భావిస్తారు. 21 రకాల చెట్లతో తయారుచేసే ఈ కషాయాన్ని ఊళ్లో వారందరికీ పంపిణీ చేస్తున్నారు. ఇలా గ్రామాస్తులు కఠిన నియమాలు పాటిస్తూ కరోనాను పొలిమేర కూడా దాటనివ్వలేదు.