ఎమ్మెల్యేల ఎరకేసును సీబీఐ ఎంక్వయిరీకి ఆదేశించిన హైకోర్టు
TS High Court: పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు
TS High Court: మొయినాబాద్ ఫాంహౌస్‌లో జరిగినఎమ్మెల్యేలకు ఎర కేసును సమగ్ర దర్యాప్తు చేయాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. సిట్ దర్యాప్తు చేస్తున్న ఈ కేసును తాజాగా సీబీఐ దర్యాప్తుకోసం హైకోర్టు ఆదేశించడంతో సంచలనం రేకెత్తించింది. దీంతో కొద్ది రోజులుగా బీఆర్ఎస్-బీజేపీ మధ్య జరుగుతున్న మొయినాబాద్ ఫాంహౌస్ వార్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సిట్ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు జారీ చేశారు.
సిట్ నోటీసులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో సిట్ అధికారులు వ్యవహిరస్తున్నారని నిందితుల తరఫున లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రికి ముందే అన్ని వివరాలు ఎలా తెలుస్తున్నాయని వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తులో ముందు నుంచే అవకతవకలు జరుగుతున్నాయని ప్రస్తావించారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. దర్యాప్తును తక్షణమే సీబీఐకి అప్పగించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. అనంతరం అప్పీల్ కు అవకాశం ఇవ్వాలంటూ అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి చేయగా.. అందుకు హైకోర్టు అంగీకరించింది. బెంచ్ నిర్ణయం తర్వాతే సీబీఐ దర్యాప్తుపై తుది ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఎమ్మెల్యేల ఎరకేసును దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతించారు. ఈకేసులో నిజానిజాలను నిగ్గు తేల్చాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చి, అబద్ధపు ప్రచారంతో బీజేపీని బదనాం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఫాం హౌజ్ కథకు కర్మ, కర్త, క్రియ అన్నీ సీఎం కేసీఆరేనని బండి సంజయ్ పేర్కొన్నారు.