Lagcherla Attack: పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ
Patnam Narender Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ ను బుధవారం తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
Patnam Narender Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు బుధవారం కొట్టివేసింది.లగచర్లలో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మెరిట్స్ ఆధారంగా ఆయన బెయిల్ పిటిషన్ ను పరిశీలించాలని కింది కోర్టును ఆదేశించింది హైకోర్టు.
వికారాబాద్ జిల్లా లగచర్ల లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు ఇతర అధికారులపై దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నరేందర్ రెడ్డితో పాటు 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని నవంబర్ 14న ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్నతెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది. రిమాండ్ రిపోర్టులో తాను చెప్పినట్టుగా ఉన్న స్టేట్ మెంట్ తాను పోలీసులకు చెప్పలేదని కూడా ఆరోపించారు. తన సంతకం తీసుకొని పోలీసులు ఈ స్టేట్ మెంట్ రాసుకున్నారని ఆయన అప్పట్లో ఆరోపించారు.
దుద్యాల మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే లగచర్లతో పాటు సమీప గ్రామాల రైతులు ఫార్మాక్లస్టర్ కు భూమిని ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో నవంబర్ 29న ఈ భూసేకరణ నోటిఫికేషన్ ను ప్రభుత్వం రద్దు చేసింది. దీని స్థానంలో మల్టిపర్సస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసింది.