Phone Tapping Case: హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు
Phone Tapping Case: మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మంగళవారం కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Phone Tapping Case: మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మంగళవారం కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీసులకు చక్రధర్ ఫిర్యాదు చేశారు. దీంతో హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన రాధాకిషన్ రావుపై కేసు నమోదైంది. 120 (బీ), 386,409,506 , రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
హరీష్ రావుపై చక్రధర్ గౌడ్ ఫిర్యాదు
తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని జూబ్లీహిల్స్ ఏసీపీకి సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై నవంబర్ 18న జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు ఆయన హాజరయ్యారు.చక్రధర్ గౌడ్ నుంచి ఆయన పోలీసులు వివరాలు తీసుకున్నారు. తన డ్రైవర్ తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని ఆయన ఆ ఫిర్యాదులో చెప్పారు. తన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అడిగిన సమాచారం ఇచ్చినట్టు నవంబర్ 18న ఆయన మీడియాకు చెప్పారు. అప్పటి ఇంటలిజెన్స్ డీసీపీ రాధాకిషన్ రావు తనను బెదిరించారని కూడా ఆయన ఆరోపించారు.
సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారని అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇవే ఆరోపణలను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదైంది. తొలుత ఈ కేసులో ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అప్పట్లో ఎస్ఐబీలో ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావు ప్రధానంగా ఆరోపణలున్నాయి. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు.ఆయనకు గ్రీన్ కార్డు కూడా వచ్చింది. తనను రాజకీయ శరణార్ధిగా చూడాలని ఆయన అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. మరో వైపు ఇదే కేసులో శ్రవణ్ రావుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన కూడా అమెరికాలో ఉన్నారని పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని అమెరికా నుంచి రప్పించేందుకు పోలీసులు ఇంటర్ పోల్ తో సంప్రదింపులు జరిపారు.