Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదం
Water Issue: ప్రాజెక్టుల దగ్గర టెన్షన్ వాతావరణం * అనుమతి లేకుండా ఏపీ నీటిని తరలించుకుపోతుందన్న తెలంగాణ నేతలు
Water Issue: తెలుగురాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతోంది. నేతల మాటల యుద్ధంతో వివాదం ముదిరి పాకాన పడుతోంది. మరోవైపు భారీగా పోలీసులు మోహరించడంతో.. ప్రాజెక్టుల దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది.
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం రోజురోజుకూ ముదురుతోంది. దీంతో తమ నీటి హక్కులు కాపాడుకునేందుకు పోలీసులను కూడా రంగంలోకి దించాయి రెండు రాష్ట్రాలు. ఏపీ తమ వాటాను వాడుకోకుండా నీటిని తరలించుకుని పోయే ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ఆరోపిస్తుంటే.. తెలంగాణ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తుంని ఏపీ అంటోంది. ఇలా నేతల మాటల యుద్ధంతో కృష్ణా జలాల రగడ మరింత తీవ్రంగా మారుతుంది.
అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోల ప్రకారమే తెలంగాణ నదీ జలాలను వాడుకుంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ నీటిని ఏపీ దోచుకుంటోందని విమర్శించారు. ఏపీ వితండవాదం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన జీవోల ప్రకారమే నీటిని విద్యుత్ కోసం వినియోగిస్తున్నామన్నారు.
ఇక తెలంగాణ నేతల విమర్శలకు అటు ఏపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. వైయస్సార్ ను విమర్శిస్తే తెలంగాణ నేతలకు మర్యాద ఉండదని ఎమ్మెల్యే రోజా వార్నింగ్ ఇచ్చారు. నదీ జలాలను తెలంగాణ అక్రమంగా వాడుకోవడం తమ ప్రాంత ప్రజలకు అన్యాయం చేయడమేనని.. ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఇక ఈ వివాదంపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల.. వివాదం పరిష్కారం కావాలనే ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకోవడమే రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యమన్నారు. శ్రీశైలంలో 800 అడుగుల లోతులో కృష్ణానీటిని తీసుకోవడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోందని సజ్జల అన్నారు.
నేతల మధ్య మాటల తూటాలు.. ప్రాజెక్టుల దగ్గర పోలీసుల పహారా.. ఏపీ విద్యుదుత్పత్తి ఆపమన్నా తెలంగాణ వందశాతం ఉత్పత్తి ప్రారంభించడంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య జల జగడం హీట్ రేపుతోంది. దీంతో కృష్ణా జలాల వివాద పరిష్కారానికి తెరదించేందుకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 9న త్రీమెన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని బావిస్తోంది.