ఉపాధి వేటలో.. కటకటాల పాలు..కరోనాతో రోడ్డున పడ్డ గల్ప్ కార్మికులు

* విజిట్ వీసాతో కొందరు జైలు పాలు * వందల సంఖ్యలో ఉపాధి కోల్పోయిన నిరుద్యోగులు * స్వదేశాల్లో కొందరు.. గల్ప్ జైళ్లలో మరికొందరు

Update: 2020-11-23 06:12 GMT

కరోనా వైరస్.. గల్ప్ కార్మికులను రోడ్డు పాలు చేసింది. గంపెడాశలతో ఎడారి దేశానికి వెళ్లిన వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. గల్ప్ దేశాల్లో పనుల్లేక కొందరు ఇంటి బాట పట్టగా.. చాలా మంది కార్మికులు వలస కూలీలుగా పనిచేసేందుకు వెళ్లి జైలు పాలవుతున్నారు. నిజామాబాద్ జిల్లా వాసులు షార్జా జైళ్లో మగ్గుతున్నారు. మరికొందరు ఉపాధి కోల్పోయి అనారోగ్యం బారిన పడి.. మృత్యువాత పడుతున్నారు. గల్ప్ బాధితుల వేదన అరణ్య రోదనలా మారుతోంది. కరోనా తెచ్చిన కష్టం.. గల్ప్ కార్మికులను కొలుకోలేని దెబ్బతీసింది.

ఉపాధి కోసం గల్ప్ దేశాలకు వెళ్లిన ఉమ్మడి నిజామాబాద్ వాసులు కరోనాతో రోడ్డున పడ్డారు. వేలాది మంది ఉపాధి కోల్పోయి స్వదేశాలకు తిరిగి రాగా.. వందల మంది ఎడారి దేశంలో చిక్కుకున్నారు.

కరోనా నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో గ్యాస్ స్టేషన్లు, ఆయిల్ కంపెనీలు కంపెనీలు, హోటళ్లు మూసేశారు. కంపెనీలు స్ధానికులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. విజిట్ వీసాలపై వచ్చిన కార్మికులకు పనులకు అనుమతించడంలేదు. ఇందల్వాయి మండలం నల్లవెల్లికి చెందిన ప్రభాకర్ కూలీ పనులకు బయటకు రాగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్ తరహాలో చిన్న చిన్న తప్పులకు వందలాది మంది జైళ్లలో మగ్గుతున్నారు. తమ వారిని స్వదేశానికి రప్పించాలని గల్ఫ్ బాధితుల కుటుంబాలు వేడుకుంటున్నాయి.

ఉపాధి కోసం మలేషియా వెళ్లిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన శ్రీనివాస్ దొంగతనం నేరంపై తోటి కార్మికులు నిర్బంధించి చంపుతామని బెదిరిస్తున్నారు. దొంగతనం చేయలేదని, తనను ఎలాగైనా కాపాడాలని బంధుమిత్రులను ఫోన్ లో వేడుకుంటున్నాడు. బాధితుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కరోనా తో 60శాతం తెలంగాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని గల్ప్ సంక్షేమ సంఘం నేతలు చెబుతున్నారు. చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్షలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోని బాధితులను కాపాడాలని కోరుతున్నారు.

గల్ఫ్ దేశాల్లో తమవారి దుస్థితిపై కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నాయి.

Tags:    

Similar News