అంతర్రాష్ట్ర సర్వీసులపై త్వరలో నిర్ణయం : మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.
లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి పక్రరాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలకు లేఖ రాసినట్టు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లేఖలు రాసిన నాటి నుంచి ఇప్పటివరకు రెండు రాష్ట్రాల నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదని తెలిపారు. అంతరాష్ట్ర బస్సులను పునరుద్ధరించే విషయంలో మన రాష్ట్ర అధికారులు, ఆయా రాష్ర్టాల నుంచి అధికారులు వస్తే చర్చిస్తారని పేర్కొన్నారు. ప్రాధాన్యతాక్రమంలో కిలోమీటర్ ప్రాతిపదికన సర్వీసులపై నిర్ణయం తీసుకొనేందుకు అధికారులను నియమించాలని కోరినట్టు చెప్పారు.
ఇక ఏపీ మంత్రి పేర్ని నాని అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై త్వరలో తెలంగాణ రవాణాశాఖతో మాట్లాడుతానని పేర్కొన్నారు. శనివారం లేక్‌వ్యూ అతిథిగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. బస్సుల సర్వీసుల విషయంలో తెలంగాణ మంత్రితో సోమవారం ఫోన్‌లో సంప్రదిస్తానన్నారు. తెలంగాణ మంత్రి, అధికారులను తాము విజయవాడకు ఆహ్వానించాలని అనుకుంటున్నామని, మంత్రి పువ్వాడతో మాట్లాడిన తర్వాత ఎక్కడ సమావేశమవ్వాలనే దానిపై స్పష్టత వస్తుందని తెలిపారు.