స్టడీ మూడ్‌లో తెలంగాణ స్టూడెంట్స్‌.. నేటి నుంచి టెట్‌ దరఖాస్తుల స్వీకరణ...

Telangana - TET 2022: *జూన్‌ 12న పరీక్ష.. అదే నెల 27న ఫలితాలు *ఉద్యోగ ప్రకటనలతో అలర్టయిన నిరుద్యోగులు

Update: 2022-03-26 06:14 GMT

స్టడీ మూడ్‌లో తెలంగాణ స్టూడెంట్స్‌.. నేటి నుంచి టెట్‌ దరఖాస్తుల స్వీకరణ...

Telangana - TET 2022: తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. నోటిఫికేషన్ల కోసం ఏళ్ల నుంచి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో మళ్లీ ఆశల దీపం చిగురించింది. యువతీ, యువకుల రాకపోకలతో కోచింగ్‌ సెంటర్లు కళకళలాడుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనల జారీకి ముందస్తు ప్రక్రియపై టీఎస్‌పీఎస్సీ వడివడిగా అడుగులు వేస్తోంది. తొలివిడతలో ప్రభుత్వ విభాగాల వారీగా పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేయడంతో ఆయా విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమైంది. నోటిఫికేషన్‌కు ముందుగా ప్రాథమిక కార్యాచరణపై కసరత్తు ప్రారంభించింది.

గ్రూప్‌-1తో పాటు వైద్యారోగ్యశాఖ పరిధిలోని పలు కేటగిరీల ఉద్యోగాల భర్తీ బాధ్యతను ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తూ వీలైనంత త్వరగా ప్రతిపాదనలు తెప్పించుకోవాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. రాష్ట్రంలో చేపట్టనున్న ఉద్యోగ నియామకాల పరీక్షల కోసం ఉన్న సిలబస్‌లో కొన్నిమార్పులు, చేర్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీని రూపకల్పనకు ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుంది.

ఈ బాధ్యతను సీఎస్‌ నేతృత్వంలోని రాష్ట్రస్థాయి నియామకాల కమిటీకి సర్కారు అప్పగించింది. తెలంగాణలో సుదీర్ఘ అనుభవం, వివాదరహితులు, ఎలాంటి అభియోగాలు, ఆరోపణలు లేని వారిని మాత్రమే సిలబస్‌ కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. వీరి ఎంపిక అనంతరం 15 రోజుల్లోపు సిలబస్‌ను రూపొందించి టీఎస్‌పీఎస్సీతో పాటు ఇతర నియామక సంస్థలకు అందజేస్తారు. దీని ఆధారంగా నియామక సంస్థలు సిలబస్‌ను ప్రకటిస్తాయి. పరీక్షల నిర్వహణ అనంతరం వాల్యూయేషన్‌లోనూ వీరికి అవకాశం కల్పించే వీలున్నట్లు తెలుస్తోంది.

అయితే.. ఉద్యోగ నియామకాల కోసం రాత పరీక్షలు తప్పనిసరి. తెలంగాణలో కొత్త నియామకాలు తొలిసారిగా 95 శాతం స్థానికులకు రిజర్వేషన్‌ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దీనికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించింది తెలంగాణ సర్కార్. పోటీ పరీక్షల సందర్భంగా కరెంట్‌ అఫైర్స్‌, జనరల్ నాలెడ్జ్‌, జనరల్‌ సైన్స్‌, పర్యావరణ, ఆర్థిక, సామాజిక అంశాలు, భౌగోళిక స్వరూపం, చరిత్ర, సంస్కృతి, రాజ్యాంగం, పాలన, ప్రభుత్వ విధానాలు వంటివి ప్రధానంగా ఉంటాయి.

తెలంగాణ చరిత్ర, ఉద్యమ ప్రస్థానం, రాష్ట్ర ఆవిర్భావ పరిణామాలు తదితర అంశాలతో పాటు కొత్త రాష్ట్రమయ్యాక ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి, చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులు, జాతీయస్థాయిలో సాధించిన విజయాలు, పరిపాలన విభాగాలు, పారిశ్రామిక ప్రగతి, కొత్త జోనల్‌ విధానం వంటి అంశాలను సిలబస్‌లో చేర్చాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 13 వేల 86 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. అయితే.. టెట్‌ సిలబస్‌లో ఎటువంటి మార్పు లేకపోవడంతో టీఎస్‌ టెట్‌ వెబ్‌సైట్లో పూర్తి సిలబస్‌ను ఉంచారు. టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి.

అందులో పేపర్‌-1 సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియామకానికి, పేపర్‌-1 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. పేపర్‌-1కు 1 నుంచి 8 తరగతులు, పేపర్‌-2కు 6 నుంచి 10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి. డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ఈసారి టెట్‌ రాసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నిర్ణయంతో దాదాపు 25 వేల మందికి ప్రయోజనం కలుగనుంది. అందులో డీఈడీ విద్యార్థులు 3 వేల మంది వరకు ఉంటారని అంచనా. అలాగే.. గతంలో టెట్‌లో అర్హత సాధించినవారు.. టెట్‌-2022కు హాజరై స్కోర్‌ పెంచుకొనే అవకాశం కల్పించారు.

నేటి నుంచి ఏప్రిల్ 12వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీకరించనున్నారు. జూన్‌ 6 నుండి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇక.. జూన్‌ 12న పరీక్ష.. అదే నెల 27న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఎగ్జామ్‌ సెంటర్‌ ఫుల్‌ఫిల్‌ కాగానే.. ఆ సెంటర్‌ పేరు వెబ్‌సైట్‌లో కనిపించదని, అప్పుడు అభ్యర్థులు మిగిలిన సెంటర్లను ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఆఫ్‌లైన్‌ విధానంలో జరిగే ఈ టెట్‌లో మల్టిపుల్‌ ఛాయిస్‌ ఉంటాయి. అలాగే.. ఎగ్జామ్‌ పేపర్‌ రెండు బాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇంగ్లీష్‌తో పాటు అభ్యర్థులు ఎంచుకున్న భాషలో పరీక్ష పత్రం ఉంటుంది. 150 మార్కులకు జరిగే ఈ పరీక్షలో జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు రావాలని తెలిపింది.

Tags:    

Similar News