Telangana State To Make History : సీఎం కేసీఆర్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉన్న రైతులు, మత్సకారులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలిచింది. అంతే కాదు వారి అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను కూడా అమలుచేసింది. ముఖ్యంగా మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం కోటపడు గ్రామంలోని మచినేని చెరువులో ప్రభుత్వం పంపిణీ చేసిన 68వేల ఉచిత చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కుల వృత్తులను, వర్గాలను సమానంగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి రెండో సారి అఖండ మెజార్టీతో ప్రజలు ఆయనకు పట్టం కట్టారన్నారు.
2020-21 సంవత్సరంనకు గాను ప్రభుత్వం 100 శాతం రాయితీపై జిల్లాలో 963 చెరువులలో 3.45 కోట్ల చేప పిల్లలను వదలనున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో 963 చెరువులకు గాను 3,45,47,710 చేప పిల్లలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 691 చెరువులకు గాను 1,78,68,300 చేపపిల్లలు పంపిణీ చేస్తున్నారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 1694 చెరువులకు (చిన్న, పెద్దా చెరువులు కలిపి) గాను 5.24 కోట్లు (5,24,16,010) చేప పిల్లలను వదులుతామన్నారు. ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతం రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదన్నారు. ప్రాథమిక సంఘాలు143, మహిళ సంఘాలు 30, హరిజన సంఘాలు 6, గిరిజన సంఘాల్లో 14,031 మంది మత్స్యకారులకు సభ్యత్వం కల్పించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో సహజ నీటి వనరులపై ఆధారపడి నేటి వరకు186 సహకార సంఘాల నమోదు అయ్యాయని తెలిపారు. మత్స్య సంపదలో దేశంతో పోటీ పడి నీలి విప్లవం వైపు పయనిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మత్స్యశాఖ జిల్లా అధికారి డి సతీష్, ప్రజాప్రతినిధులు, అధికారులు నాయకులు పాల్గొన్నారు.