New Year 2022: మందుబాబులకు తెలంగాణ పోలీసుల షాక్..తాగి పట్టుబడితే పదివేల జరిమానా..
New Year 2022: మందుబాబులకు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు.
New Year 2022: మందుబాబులకు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు కఠినతరం చేశారు. మద్యం సేవించి మొదటిసారి పట్టుబడితే 10వేలు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష పడుతుందని వెల్లడించారు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేలు ఫైన్ లేదా రెండేళ్ల జైలుశిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రేపు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లై ఓవర్లు మూసివేస్తామన్న పోలీసులు క్యాబ్, ఆటో డ్రైవర్లకు యూనిఫాంతో పాటు వాహన డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలని హెచ్చరించారు.
మరోవైపు హైదరాబాద్ ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో న్యూఇయర్ వేడుకలకు సిద్దమవుతున్నారు. గత రెండేళ్లుగా సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉన్న నగరవాసులు ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ఫుల్‌గా ఎంజాయ్ చేయాలనే దృఢనిశ్చయంతో ఉన్నారు. మరోవైపు కరోనా నిబంధనలు పాటిస్తూ పబ్‌లకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కార్. దీన్ని ఆసరాగా చేసుకున్న పబ్ నిర్వాహకులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.
ఇదిలా ఉంటే న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పబ్బుల ముందు హెచ్చరిక బోర్డులు పెట్టాలని, తాగి వాహనం నడిపితే పబ్ నిర్వాహకులదే బాధ్యత వహించాలని తెలిపింది. ఆంక్షలు 4వ తేదీ వరకు అమలు పర్చాలని పోలీసులను ఆదేశించింది.
ఇక న్యూఇయర్ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. ఓ వైపు కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడటంతో పాటు మరోవైపు డ్రంకెన్ యాక్సిడెంట్స్ నివారించడం పోలీసులకు సవాల్‌గా మారింది.
న్యూఇయర్ సందర్భంగా అప్రమత్తమైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. రేపు రాత్రి 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 5 గంటల వరకు సైబరాబాద్ లిమిట్స్‌లోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్టు చెప్పారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలని తెలంగాణ పోలీస్‌శాఖ సూచించింది. ఈవెంట్ నిర్వాహకులు గైడ్‌లైన్స్ ప్రకారం వేడుకలు నిర్వహించాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తెలంగాణ పోలీసులు.
దేశంలో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కేసుల పెరుగుదల చూస్తుంటే థర్డ్ వేవ్ తప్పేలా లేదని చెప్పిన డీహెచ్ దేశంలో ఇప్పటికే సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.